న్యూఢిల్లీ: భారతీయ బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలను ఎగవేసి లండన్ పారిపోయిన లిక్కర్ దిగ్గజం విజయమాల్యాను అరెస్ట్ చేసిన బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు అప్పగిస్తుందా? లేదా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. గతేడాది మార్చి నెలలో లండన్ పారిపోయిన మాల్యాను రప్పించేందుకు భారత్ ఇంతకాలం చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడం వల్ల ఇలాంటి అనుమానాలకు ఆస్కారం ఏర్పడింది.
రుణాల ఎగవేత, హవాలా, విదేశీ కరెన్సీ నిబంధనల ఉల్లంఘనలాంటి అనేక కేసుల్లో మాల్యా నిందితుడు. 2009నాటి నుంచి ఈ కేసుల్లో మాల్యా విచారణ ఎదుర్కొంటున్నారు. చివరకు అనేక నాన్‌బెయిల్ అరెస్ట్ వారెంట్లు జారీ అవడంతో 2016, మార్చి నెలలో మాల్యా లండన్ పారిపోయారు. అప్పట్లో ఆయన్ని పట్టి అప్పగించాల్సిందిగా బ్రిటన్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. అందుకు బ్రిటన్ నిరాకరించడంతో భారత ప్రభుత్వం మాల్యా పాస్‌పోర్టును రద్దు చేసింది. ఆయన వద్ద బ్రిటన్ పాస్‌పోర్టు ఉన్నందున ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది.
తదనంతర చర్యల్లో భాగం గత నవంబర్ నెలలో ముంబై కోర్టు మాల్యాను పరారిలో ఉన్న నిందితుడుగా ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 31వ తేదీన సీబీఐ కోర్టు మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత బ్రిటన్ పరస్పర న్యాయ సహాయ ఒప్పందం (ఎంఎల్‌ఏటీ) కింద తమకు అప్పగించాల్సిందిగా కోరుతూ భారత విదేశాంగ శాఖ ఫిబ్రవరి 9వ తేదీన బ్రిటన్ విదేశాంగశాఖను కోరింది. ఈ మేరకు ఇరు దేశాల విదేశాంగ శాఖ అధికారుల మధ్య మంగళవారం జరిగిన చర్చల్లో కూడా ఓ అవగాహన కుదిరింది. తాము నేరుగా మాల్యాను పట్టుకొని అప్పగించలేమని, ఆయనపై తీవ్రమైన అభియోగాలు ఉన్నందున న్యాయ ప్రక్రియ ద్వారా భారత్‌కు పంపించేందుకు పూర్తిగా సహకరిస్తామని బ్రిటన్ విదేశాంగ శాఖ స్పష్టమైన హామీ ఇచ్చింది.
అలాగే ఇతర కేసుల్లో నిందితులై లండన్‌లో తలదాచుకున్న లలిత్ మోదీ, టైగర్ మెమన్లను అప్పగించేందుకు కూడా సహకరిస్తామని బ్రిటన్ విదేశాంగ శాఖ అధికారులు హామీ ఇచ్చారు. అయితే లండన్‌లో అరెస్టయిన మాల్యా స్థానిక కోర్టు నుంచి బెయిల్ తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన్ని భారతకు తీసుకరావడానికి ఇబ్బందులేమీ లేవని భారత న్యాయనిపుణులు చెబుతున్నారు.