బరేలి: పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ భారత్లో తన కార్యకలాపాల నిర్వహణకు భాషా పండితులను నియమించుకొని తమవారికి శిక్షణ ఇప్పిస్తోంది. ఈ విషయం ఇటీవల అరెస్టైన ఐఎస్ఐ గూఢచారి మహ్మద్ ఇజాజ్ విచారణలో వెల్లడైంది. భాషలో శిక్షణ కోసం భారత్కు చెందిన భాషా పండితులను ఐఎస్ఐ నియమించుకుంటోంది.
ఇజాజ్కు భారత్లోని హిందీ మాండలికంలో శిక్షణ ఇచ్చినట్లు తెలిసింది. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన ఇజాజ్కు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన స్థానిక యాసలో మాట్లాడేలా శిక్షణ ఇచ్చారు. 'ఐఎస్ఐ నన్ను రిక్రూట్ చేసుకున్న తరువాత నేను మాట్లాడే పంజాబీ యాస గురించి ఆందోళన చెందారు. అందుకే భాషా పండితునితో శిక్షణ ఇప్పించాక భారత్కు పంపారు' అని విచారణలో ఇజాజ్ వెల్లడించాడు. భారత్కు వచ్చిన తర్వాత కూడా మరోసారి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపాడని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సీనియర్ అధికారి అజయ్ పాల్ సింగ్ వెల్లడించారు.
ఐఎస్ఐ శిక్షణలో భాగంగా కంప్యూటర్, వీడియో గ్రఫీతో పాటు భారత సంస్కృతి, సాంప్రదాయలపై కూడా అవగాహన కల్పించినట్లు తెలిసింది. ఇజాజ్కు ఉర్దూ, పంజాబీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం ఉందని అధికారులు వెల్లడించారు.