అది రాజకీయ వ్యభిచారమే | It is a political fornication | Sakshi
Sakshi News home page

అది రాజకీయ వ్యభిచారమే

Published Wed, Apr 27 2016 3:05 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

అది రాజకీయ వ్యభిచారమే - Sakshi

అది రాజకీయ వ్యభిచారమే

ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం రాజకీయ వ్యభిచారం లాంటిదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.

ఎమ్మెల్యేల కొనుగోళ్లపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపాటు

♦ ఒక్కొక్కరికీ రూ.30 కోట్ల అవినీతి సొమ్ము ఇస్తున్నారు
♦ ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే పరిస్థితి ఉందా?
♦ రెండెకరాల బాబుకు రూ.వేల కోట్ల ఆస్తులెలా వచ్చాయి?
♦ బాబు కుంభకోణాలను అందరూ ప్రశ్నించాలి  
♦ ప్రజా గొంతుకగా ఉన్న ప్రతిపక్షంపై సీఎం చంద్రబాబు అక్కసు

 
 న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి:
ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం రాజకీయ వ్యభిచారం లాంటిదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, కొనుగోళ్లను కట్టడి చేయకపోతే వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం ఢిల్లీలో పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, కోరుముట్ల శ్రీనివాసులు, దేశాయి తిప్పారెడ్డి, గౌతంరెడ్డి, సునీల్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పార్టీ రూపొందించిన ‘చంద్రబాబు.. అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేశారు. ఈ రెండేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.1,34,295 కోట్లు సంపాదించుకోవడానికి అవకాశం కల్పించిన 31 కుంభకోణాల వివరాలను పుస్తకంలో వివరించామని తెలిపారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..

 అంత నల్లధనం ఎలా వచ్చింది?
 ఏపీలో ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఎర చూపుతూ కొనుగోలు చేస్తున్నారు. మనం ప్రజాస్వామ్యలో ఉన్నాం. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మన కళ్లముందే ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఇస్తుంటే.. ఇంతింత డబ్బు ఎలా వచ్చింది? అని అడిగే పరిస్థితి ఉందా? తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోతే.. ఇంత నల్లధనం ఎలా వచ్చింది చంద్రబాబూ? అని అడిగే పరిస్థితి ఉందా? నల్లధనాన్ని ఎమ్మెల్యేలకు ఇచ్చి విచ్చలవిడిగా కొనుగోలు చేస్తా ఉంటే.. ఆ డబ్బు ఎక్కడిదని అడగలేని దుస్థితి నెలకొంది.  

 ఇంతకన్నా దారుణం ఉంటుందా?
 ఇంతింత డబ్బులు ఎరచూపుతూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంతో ఆగిపోకుండా.. కొంతమందికి మంత్రి పదవులూ ఇస్తామని, శాసనసభ్యత్వానికి అనర్హులు కాదని చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇదెలా సాధ్యం? అని అడగలేకపోతున్నాం. వేరే పార్టీ టికెట్‌పై గెలిచిన అభ్యర్థులు శాసనసభ్యత్వానికి రాజీనామా చేయకుండా.. వారితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తానని బాబు చెబుతున్నారు. ఇంతకంటే దిక్కుమాలిన పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఉంటుందా? ఇలాంటివి ఎక్కడా జరగలేదు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నారు.

 ఎమ్మెల్యే పోతే మరో నాయకుడు వస్తారు
 మాకు 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 13 మంది పోయారు. వారికి ఇద్దరో ముగ్గురో జత అయినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఎమ్మెల్యేలను గెలిపించే వారు ప్రజలు. దేవుడి ఆశీర్వాదం, ప్రజల గుండెల్లో స్థానం ఉంటే.. ఈ ఎమ్మెల్యే కాకుంటే మరో నాయకుడిని తెచ్చుకుంటారు. గత ఎన్నికల్లో మా పార్టీకి వచ్చిన ఓట్లు 45 శాతం. చంద్రబాబు, ఆయన కూటమికి కలిపి వచ్చిన ఓట్లు 46.86 శాతం. ఓట్ల తేడా 1.86 శాతం. రాష్ట్రం మొత్తం మీద చూస్తే.. ఇరు పార్టీల మధ్య  తేడా 5 లక్షల ఓట్లే. అదేమీ పెద్ద తేడా కాదు. రాష్ట్రంలో ప్రధానంగా పోటీపడినవి రెండే పార్టీలు. కొంతమంది ఎమ్మెల్యేలు పోయినా ఎక్కడా నష్టం ఉండదు.

 ప్రజల గొంతు నొక్కుతున్నారు
 ఇక్కడ జరుగుతున్నది... ప్రజల గొంతుకను నొక్కడం. ఎన్నికల ముందు బాబు అబద్దాలు చెప్పి మోసం చేయడంతో.. రైతులు, డ్వాక్రా మహిళలు, చదువుకున్న పిల్లలు బాధ పడుతున్నారు. బాబు ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో ప్రతిచోటా వ్యతిరేకత కనిపిస్తోంది. వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు. మొత్తం మాఫీ చేస్తానని బాబు హామీ ఇచ్చారు. టీడీపీ మేనిఫెస్టోలోనూ పెట్టా రు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలంటూ ఊదరగొట్టారు. దానిపై వడ్డీలే రూ.24 వేల కోట్లు. ఆయన చేస్తున్న రుణమాఫీ.. వడ్డీలో మూడో వంతుకు కూడా సరిపోలేదు. రైతులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.

 ప్రశ్నించే గొంతు ఉండకూడదనే...
 చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజలు నినదిస్తున్నారు. ప్రజలకు గొంతుక ఇస్తున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తున్నారు. ప్రజల గొంతు వినపడకూడదని బాబు భావిస్తున్నారు. జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించే గొంతు ఉండకూడదని సీఎం దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. మీడియాలో ఉన్న మనం, చదువుకున్న మనం.. చంద్రబాబు చేస్తున్న అనైతిక రాజకీయాలను చూస్తూ ఊరుకోవడం, ప్రశ్నించకపోవడం తప్పు కాదా? ఎమ్మెల్యేల కొనుగోళ్లు హర్షించాల్సిన విషయమా?

 రెండేళ్లలో 1.34 లక్షల కోట్ల అక్రమ సంపాదన
 చంద్రబాబు రెండేళ్లలో రూ.1.34 లక్షల కోట్ల అక్రమ సంపాదన మూటగట్టుకున్నారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు చేసిన 31 కుంభకోణాల వివరాలు ‘చంద్రబాబు.. అవినీతి చక్రవర్తి’ పుస్తకంలో ఉన్నాయి. ఆయన ఏ విధంగా అన్యాయం చేశారు? ప్రభుత్వానికి ఎలా నష్టం చేశారు? ఆధారాలు, జీవోలతో సహా స్కాన్ చేసిన కాపీలు పెట్టాం. కరెంట్ కొనుగోలులో గోల్‌మాల్.. ఇసుక మాఫియా దగ్గర నుంచి ల్యాండ్ మాఫియా వరకు కుంభకోణాలు ఉన్నాయి. రూ.1.34 లక్షల కోట్ల కుంభకోణాల గురించి చంద్రబాబును ప్రశ్నించాల్సిన సమయం ఇది.

 రూ.లక్ష కోట్ల రాజధాని భూ కుంభకోణం
 రాజధాని పేరిట ల్యాండ్ డీల్స్‌లో చంద్రబాబు బినామీలు ఎవరు? వారు కొన్న భూముల వివరాలన్నీ ఉన్నాయి. ఎవరి పేరుతో కొన్నారో వారి వివరాలూ ఇచ్చాం. లోతుగా విచారణ చేస్తే ఇంకా ఎక్కువ లావాదేవీలు బయటపడతాయి. రాజధాని పేరుతో ఎన్ని వేల ఎకరాలు మోసం చేశారో.. ఆ భూముల వాస్తవ మార్కెట్ విలువ చూస్తే రాజధానిలోనే రూ.లక్ష కోట్ల అవినీతి జరిగినట్లు తేలింది. మిగతా రూ.34 వేల కోట్లు వివిధ కుంభకోణాలకు సంబంధించినవి.

 ఇన్‌సైడర్ ట్రేడింగ్ కాదా?
 2014 మే నెలలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్కడ రాజధాని ఏర్పాటు చేస్తున్నారనే విషయాన్ని బుర్రలో పెట్టుకొని, వేరే చోట వస్తుందంటూ లీకులు ఇచ్చారు. కానీ, బినామీలతో రాజధాని ప్రాంతంలో తక్కువ రేట్లకు రైతుల నుంచి  భూములు కొనుగోలు చేయించారు. ఆరేడు నెలల తర్వాత.. బినామీలు కొనుగోలు చేసిన ప్రాంతంలో వస్తుందని ప్రకటించారు. ఇది ఇన్‌సైడర్ ట్రేడింగ్ కాదా? సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూ ‘ఓత్ ఆఫ్ సీక్రసీ’ చంద్రబాబు తీసుకున్నారు. దాన్ని ఉల్లంఘించి, భారీగా సొమ్ము చేసుకున్నారు. పూర్తిగా విచారణ జరిగితే రాజధానిలో బాబు బినామీల భూ లావాదేవీలన్నీ బయటపడతాయి.

 రాజధాని జోనింగ్‌లోనూ మతలబు
 రాజధాని వచ్చిన తర్వాత బినామీలకు మేలు చేయడం కోసం జోనింగ్ చేశారు. బినామీల భూములు పట్టణ ప్రాంతం, అగ్రిజోన్-3లో ఉన్నాయి. మిగతా రైతుల భూములు వ్యవసాయానికి తప్ప మిగతా కార్యకలాపాలకు వీల్లేని విధంగా అగ్రిజోన్-1లో ఉన్నాయి. చంద్రబాబు బినామీల భూములకు ఎక్కువ ధర కల్పించడం కోసం వాటిని రియల్‌ఎస్టేట్ జోన్‌లో పెట్టారు. మిగతా రైతులను భూములను అమ్ముకోలేని దశలోకి నెట్టేశారు. ఇది మోసం కాదా? చంద్రబాబు కుంభకోణాల్లో ఇదొక ఉదాహరణ మాత్రమే.

 ఎమ్మెల్యేలను కొనేయడం ఘనకార్యమా?
 లింగమనేని రమేష్ భూములకు 10 అడుగుల అవతల ల్యాండ్‌పూలింగ్ ఆగిపోయింది. ఎందుకు అలా ఆగిపోయింది? చంద్రబాబు ప్రస్తుతం లింగమనేని రమేష్ ఇంట్లోనే ఉన్నారు. 2014 మే-డిసెంబర్ మధ్య జరిగిన రిజిస్ట్రేషన్ల కాపీలను పుస్తకంలో పొందుపరిచాం. మరింత లోతుగా సీబీఐ విచారణ జరిగితే జీపీఏలు కూడా బయటపడతాయి. భారీగా సంపాదించిన అవినీతి సొమ్ముతో  నిస్సిగ్గుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుంటే అడిగే దిక్కు లేదు. బాధాకరమైన విషయం ఏమిటంటే.. చంద్రబాబు సోదర మీడియా సంస్థలు దాన్ని ఘనమైన విషయంగా చూపిస్తున్నాయి. ఘనకార్యం చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నాయి. ఇంత నల్లధనం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించకుండా వాళ్లు పోతున్నారు, వీళ్లు పోతున్నారంటూ.. చంద్రబాబు కొనుగోళ్లను పెద్ద ఘనకార్యంగా చూపిస్తున్నాయి.
 
 చంద్రబాబును నిలదీయండి
 కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించడం లేదు? వారిపై అనర్హత వేటు ఎందుకు వేయించడం లేదు? ఫిరాయించిన ఎమ్మెల్యేలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు వేయించే ధైర్యం చంద్రబాబుకు లేదు. మీ పరిపాలన మీద మీకు ఎందుకు నమ్మకం లేదు అని చంద్రబాబును మీడియా ప్రతినిధులు నిలదీయాలి. 1978లో రెండెకరాల ఆస్తితో చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభించారు. ఇప్పుడు ఆయనకు రూ.వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోకుండా విచారణకు అంగీకరిస్తే బాబు బండారం బయటపడుతుంది. పార్టీ ఫిరాయింపులను కట్టడి చేయకపోతే.. అధికారంలో ఉన్నవాళ్లు అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కండువాలు కప్పుకుంటూ పోతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement