న్యూఢిల్లీ: ఆధార్ సంఖ్యను గుర్తింపు ధ్రువీకరణగా వాడుకునేందుకు వీలు కల్పించే బిల్లును కేంద్రం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆధార్ చట్టాన్ని ప్రతిపాదించిన తాజా సవరణల ప్రకారం బ్యాంకు అకౌంట్లు ప్రారంభించేందుకు, మొబైల్ ఫోన్ కనెక్షన్ పొందేందుకు ఆధార్‌ను వాడుకోవచ్చు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు పడేందుకు ఇందులో వీలు కల్పించారు. ఆధార్ చట్టం–2016 సవరణ బిల్లు ఉభయసభల ఆమోదం పొందితే ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో చట్టంగా అమల్లోకి వస్తుంది. లోక్‌సభలో చర్చ సందర్భంగా బిల్లులోని అంశాలపై ఆర్‌ఎస్‌పీ సభ్యుడు ప్రేమ్‌చంద్రన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రతిపాదిత అంశాలు సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా ఉల్లంఘించేలా ఉన్నాయన్నారు. ప్రైవేట్ సంస్థలకు ఆధార్ డేటాను అప్పగించడం ప్రాథమిక హక్కులు, ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనన్నారు. దీనిపై సమాచార, సాంకేతిక శాఖల మంత్రి రవి శంకర్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. ‘ప్రతిపాదిత అంశాలన్నీ సుప్రీకోర్టు ఆదేశాలకు లోబడే ఉన్నాయి’అని తెలిపారు. ఆధార్ నిబంధనలు ఉల్లంఘించినా, దుర్వినియోగపరిచినా రూ.కోటి వరకు జరిమానా విధించేలా ఈ బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒక వ్యక్తి ఆధార్ సంఖ్యను రహస్యంగా ఉంచే వర్చువల్ గుర్తింపు సంఖ్యను ఉపయోగించేందుకు ఇందులో ప్రతిపాదించింది. ఆధార్ డేటాను తస్కరించిన సంస్థలకు శిక్షను 10 ఏళ్లకు పెంచింది.
జీరో అవర్ అంశాలపై..
జీరో అవర్‌తోపాటు ప్రత్యేక ప్రస్తావనాంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు 30 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, లేకుంటే ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు మంత్రులకు సూచించారు. సోమవారం ఆయన రాజ్యసభలో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment