identity proof
-
అబద్దాలతో పెళ్లి చేసుకుంటే.. ఇకపై పదేళ్ల జైలు..
ఢిల్లీ: 1860 నాటి భారత శిక్షాస్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మహిళలపై నేరాలకు సంబంధించిన నిబంధనలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గుర్తింపును దాచిపెట్టి యువతిని వివాహం చేసుకుంటే ఇలాంటి నేరాలకు ఇకపై 10 ఏళ్ల వరకు శిక్ష పడే విధంగా నింబంధనలను పొందుపరిచారు. ఇదే కాకుండా ఉద్యోగం, పదోన్నతి వంటి తప్పుడు వాగ్దానంతో మహిళను వివాహమాడటం లేదా లైంగిక చర్యలకు పాల్పడితే కూడా పదేళ్ల వరకు శిక్ష పడే విధంగా నూతనంగా తీసుకువచ్చిన న్యాయ చట్టాల్లో నిబంధనలు పొందుపరిచారు. ఉద్యోగం, పదోన్నతి, వివాహం వంటి అంశాల్లో తప్పుడు వాగ్దానాలతో స్త్రీతో లైంగిక చర్యను అత్యాచారంగా పరిగణించలేదు కానీ పదేళ్ల వరకు శిక్ష ఉంటుందని స్టాండింగ్ కమిటీ పేర్కొంది. అత్యాచార ఘటనల్లో.. కొత్త న్యాయ చట్టాల ప్రకారం గ్యాంగ్‌రేప్ నేరంలో దోషికి 20 ఏళ్ల శిక్ష పడుతుంది. 18 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి ఒడిగడితే మరణిశిక్ష ఉంటుంది. అత్యాచారంలో బాధితురాలు మరణిస్తే.. 20 ఏళ్లకు తగ్గకుండా శిక్ష, జీవితకాలం లేదా మరణశిక్ష పడే అవకాశాలను చట్టంలో సూచించారు. 12 ఏళ్లలోపు బాలలపై రేప్ ఘటనల్లోనూ ఇదే తరహా శిక్షలు అమల్లోకి వస్తాయి. బ్రిటీష్ వలస పాలన తాలూకు అవశేషాలుగా కొనసాగుతూ వస్తున్న మూడు కీలక నేర న్యాయ చట్టాలకు చెల్లు చీటీ పాడే దిశగా శుక్రవారం పెద్ద ముందడుగు పడింది. వాటి స్థానంలో స్వదేశీ చట్టాలను తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ లు చరిత్రగా మిగలనున్నాయి. వాటి స్థానంలో పూర్తి భారతీయ చట్టాలు రానున్నాయి. ఈ మేరకు న్యాయ సంహిత బిల్లు– 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు–2023, భారతీయ శిక్షా బిల్లు–2023లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఇదీ చదవండి: ఐపీసీ, సీఆర్పీసీ స్దానంలో కొత్త చట్టాలు.. చిల్లర నేరాలకు శిక్షగా సామాజిక సేవ -
ఐడెంటిటీ ప్రూఫ్‌గా ఆధార్.. యూఐడీఏఐ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: వ్యక్తిగత గుర్తింపు ఆధార్ విషయంలో.. ఆధార్ నిర్వహణ ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’(యూఐడీఏఐ) గురువారం కీలక ప్రకటన చేసింది. ఆధార్ వివరాలను ధృవీకరించుకున్నాకే.. ఐడెంటిటీ ఫ్రూఫ్‌గా అంగీకరించాలంటూ సూచించింది. ఆధార్ లెటర్, ఇ-ఆధార్, ఆధార్ పీవీసీ కార్డ్, ఎం-ఆధార్.. ఇలా ఆధార్ ఏ రూపంలో అయినా సరే ఐడెంటిటీ ఫ్రూఫ్‌గా తీసుకునే సమయంలో.. అందులో సమాచారం సరైందేనా? కాదా? అని ధృవీకరించాలని యూఐడీఏఐ పేర్కొంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.ఆధార్ వివరాలను ధృవీకరించుకునేందుకు క్యూఆర్ కోడ్లు, ఎం-ఆధార్ యాప్, ఆధార్ క్యూఆర్ కోడ్ స్కానర్లు ఉన్నాయని తెలిపింది. డెస్క్‌యాప్ వెర్షన్‌తో పాటు మొబైల్స్ ద్వారా ఈ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ మేరకు సెప్టెంబర్‌లో ఆధార్ వివరాల దుర్వినియోగ కట్టడికి పలు కీలక సూచనలు పౌరుల కోసం జారీ చేసిన విషయాన్ని యూఐడీఏఐ గుర్తు చేసింది. అంతేకాదు.. ఆధార్ వెరిఫికేషన్ ద్వారా ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ దుర్వినియోగానికి ఆస్కారం ఉండదని తెలిపింది. అనైతిక, సంఘ వ్యతిరేక అంశాలను అడ్డుకున్నట్లు అవుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆధార్ వినియోగం సక్రమంగా జరుగుతుందని, నకిలీ ఆధార్ల కట్టడికి తోడ్పడుతుందని స్పస్టం చేసింది. ఆధార్ పత్రాలను ట్యాంపరింగ్ గనుక చేస్తే.. ఆధార్ యాక్ట్ సెక్షన్ 35 ప్రకారం శిక్షార్హమైన నేరమని, జరిమానాలు కూడా కట్టాల్సి వస్తుందని తెలిపింది. అంతేకాదు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద ఆధార్ సమర్పించేప్పుడు దానిని ధృవీకరించుకోవాల్సిన అవసరాన్ని రాష్ట్రాలు తప్పనిసరి చేయాలంటూ యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఇదీ చదవండి: మీరు నోరు మూస్తారా? సుప్రీంలో ఏజీ అసహనం -
గుర్తింపు ధ్రువీకరణగా ఆధార్
న్యూఢిల్లీ: ఆధార్ సంఖ్యను గుర్తింపు ధ్రువీకరణగా వాడుకునేందుకు వీలు కల్పించే బిల్లును కేంద్రం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆధార్ చట్టాన్ని ప్రతిపాదించిన తాజా సవరణల ప్రకారం బ్యాంకు అకౌంట్లు ప్రారంభించేందుకు, మొబైల్ ఫోన్ కనెక్షన్ పొందేందుకు ఆధార్‌ను వాడుకోవచ్చు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు పడేందుకు ఇందులో వీలు కల్పించారు. ఆధార్ చట్టం–2016 సవరణ బిల్లు ఉభయసభల ఆమోదం పొందితే ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో చట్టంగా అమల్లోకి వస్తుంది. లోక్‌సభలో చర్చ సందర్భంగా బిల్లులోని అంశాలపై ఆర్ఎస్పీ సభ్యుడు ప్రేమ్‌చంద్రన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత అంశాలు సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా ఉల్లంఘించేలా ఉన్నాయన్నారు. ప్రైవేట్ సంస్థలకు ఆధార్ డేటాను అప్పగించడం ప్రాథమిక హక్కులు, ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనన్నారు. దీనిపై సమాచార, సాంకేతిక శాఖల మంత్రి రవి శంకర్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. ‘ప్రతిపాదిత అంశాలన్నీ సుప్రీకోర్టు ఆదేశాలకు లోబడే ఉన్నాయి’అని తెలిపారు. ఆధార్ నిబంధనలు ఉల్లంఘించినా, దుర్వినియోగపరిచినా రూ.కోటి వరకు జరిమానా విధించేలా ఈ బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒక వ్యక్తి ఆధార్ సంఖ్యను రహస్యంగా ఉంచే వర్చువల్ గుర్తింపు సంఖ్యను ఉపయోగించేందుకు ఇందులో ప్రతిపాదించింది. ఆధార్ డేటాను తస్కరించిన సంస్థలకు శిక్షను 10 ఏళ్లకు పెంచింది. జీరో అవర్ అంశాలపై.. జీరో అవర్‌తోపాటు ప్రత్యేక ప్రస్తావనాంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు 30 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, లేకుంటే ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు మంత్రులకు సూచించారు. సోమవారం ఆయన రాజ్యసభలో మాట్లాడారు. -
'ఆజాద్.. మీ ఐడీ కార్డు చూపించండి'
ఆయనో కేంద్ర మంత్రి. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయినా కూడా.. పోలింగ్ కేంద్రం వద్ద ఆయనను గుర్తింపుకార్డు చూపించాలని సిబ్బంది గట్టిగా అడిగారు. జమ్ము లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో ఈ సంఘటన జరిగింది. జోగిగేట్ ప్రాంతంలో గల డీపీఎస్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి కేంద్ర మంత్రి, జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ వెళ్లారు. కానీ, ఆయన తన గుర్తింపుకార్డు తీసుకెళ్లకపోవడంతో అక్కడి ప్రిసైడింగ్ అధికారి ఆజాద్‌ను ఓటు వేయనివ్వలేదు. ఓటర్ల జాబితాలో పేరున్నా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు లేనిదే ఓటు వేయడానికి వీల్లేదన్న విషయం తెలిసిందే. అనంతరం స్థానిక కాంగ్రెస్ నాయకుడొకరు ఆజాద్ గుర్తింపునకు తాను ష్యూరిటీగా ఉంటానని ముందుకు రావడంతో ఎలాగోలా ఆజాద్ ఓటు వేగలిగారు. కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ జమ్ము జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారని, జాతీయ స్థాయిలో సీనియర్ నాయకుడని చెప్పారు. బీజేపీ నేతలు కూడా అదే విషయం తెలిపారు. ఉధంపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్న ఆజాద్‌కు.. జమ్ములో ఓటుహక్కుంది.