'ఆజాద్.. మీ ఐడీ కార్డు చూపించండి'
ఆయనో కేంద్ర మంత్రి. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయినా కూడా.. పోలింగ్ కేంద్రం వద్ద ఆయనను గుర్తింపుకార్డు చూపించాలని సిబ్బంది గట్టిగా అడిగారు. జమ్ము లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో ఈ సంఘటన జరిగింది. జోగిగేట్ ప్రాంతంలో గల డీపీఎస్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి కేంద్ర మంత్రి, జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ వెళ్లారు. కానీ, ఆయన తన గుర్తింపుకార్డు తీసుకెళ్లకపోవడంతో అక్కడి ప్రిసైడింగ్ అధికారి ఆజాద్ను ఓటు వేయనివ్వలేదు. ఓటర్ల జాబితాలో పేరున్నా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు లేనిదే ఓటు వేయడానికి వీల్లేదన్న విషయం తెలిసిందే.
అనంతరం స్థానిక కాంగ్రెస్ నాయకుడొకరు ఆజాద్ గుర్తింపునకు తాను ష్యూరిటీగా ఉంటానని ముందుకు రావడంతో ఎలాగోలా ఆజాద్ ఓటు వేగలిగారు. కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ జమ్ము జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారని, జాతీయ స్థాయిలో సీనియర్ నాయకుడని చెప్పారు. బీజేపీ నేతలు కూడా అదే విషయం తెలిపారు. ఉధంపూర్ లోక్సభ స్థానం నుంచి పోటీచేస్తున్న ఆజాద్కు.. జమ్ములో ఓటుహక్కుంది.