ఇది నేరస్తుల నెట్‌వర్క్!
ఢిల్లీలో ‘సీసీటీవీ’ వ్యవస్థ
♦ పోలీసుల రాకను పసిగట్టేందుకు కెమెరాలు
న్యూఢిల్లీ: శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు సీసీటీవీలను ఏర్పాటు చేసి నిరంతరం సమీక్షిస్తుంటే.. అదే సాంకేతికతను ఉపయోగించుకుని యథేచ్చగా అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఢిల్లీ గ్యాంబ్లర్లు. తమ డెన్ చుట్టుపక్కల పోలీసుల సంచారాన్ని పసిగట్టి జాగ్రత్తపడుతూ.. విచ్చలవిడిగా అక్రమ వ్యాపారం చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దేశ రాజధానిలోని వసంత్ గావ్‌లో అక్రమ మద్యం, మత్తుపదార్థాలు అమ్ముతున్నారంటూ.. ఢిల్లీ పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. పోలీసులు ఆ ప్రాంతంలో రైడ్ చేయగా అక్రమ కార్యక్రమాలకు సంబంధించిన ఆనవాళ్లేమీ దొరకలేదు.
మరో ప్రాంతం నుంచి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీనిపై ఉన్నతాధికారులు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ బృందం పకడ్బందీగా వ్యవహరించి నాలుగైదు గ్యాంగులను పట్టుకున్నాక ఈ నేరస్తుల ‘సీసీటీవీ నెట్‌వర్క్’ వెలుగులోకి వచ్చింది. అక్రమ కార్యక్రమాలకు పాల్పడేవారు తమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఎలాంటి అనుమానం రాకుండా సీసీటీవీలను ఏర్పాటుచేసుకున్నారు. దీన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు ఓ వ్యవస్థను పెట్టుకున్నారు. తమ ప్రాంతంలో పోలీసులు, బీట్ కానిస్టేబుళ్ల సంచారంపై అనుమానం వస్తే వెంటనే అప్రమత్తమవుతున్నారు. దీంతో పోలీసులు పక్కా సమాచారంతో వెళ్లినా వీరిని పట్టుకోలేక పోయారు.