ఢిల్లీలో జైషే ఉగ్రవాదులు!
♦ భారీ దాడులకు కుట్ర
♦ అప్రమత్తమైన పోలీసులు
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలోకి చొరబడి దాడులకు పాల్పడిన పాకిస్తాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు.. దేశ రాజధాని ఢిల్లీనీ లక్ష్యంగా ఎంచుకున్నారు. జైషే మొహమ్మద్‌కు చెందిన ఇద్దరు మిలిటెంట్లు ఢిల్లీలోకి చొరబడ్డారని, వీరు భారీ దాడులకు, వీఐపీలను బందీలుగా పట్టుకునేందుకు కుట్ర పన్నారని నిఘా విభాగం ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులుగానీ, వస్తువులు గానీ కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కమిషనర్ బీఎస్ బస్సీ కోరారు.
నిఘా సమాచారం నేపథ్యంలో బస్సీ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటుచేశారని, మరిన్ని కేంద్ర బలగాల సహకారం కోరారని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇద్దరు జైషే మొహమ్మద్ కీలక సభ్యులు చొరబడినట్లు సమాచారమొచ్చిందన్నారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లతోపాటు ఇతర ముఖ్యప్రాంతాల్లో భద్రతను పెంచారు. ఢిల్లీలోని ముఖ్యమైన మార్కెట్లు, వీఐపీలుండే లూటెన్స్ ఢిల్లీలోనూ నిఘా తీవ్రం చేశారు.
శతాబ్ది రైలుకు బాంబు బెదిరింపు..
ఢిల్లీ-కాన్పూర్ మధ్య తిరిగే రైళ్లలో బాంబు పెట్టినట్లు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘజియాబాద్ వద్ద ఆదివారం ఉదయం ఢిల్లీ-లక్నో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను ఆపి సోదాలు చేశారు. బాంబు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. గంటన్నరపాటు రైలును నిలిపివేయడంతో ఆ మార్గంలోని రైళ్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. శతాబ్ది, దురంతో, రాజధాని, వైశాలి, నీలాంచల్ ఎక్స్‌ప్రెస్‌లకు బాంబు బెదిరింపు వచ్చిందని ఢిల్లీ డివిజనల్ రైల్వే మేనేజర్ అరుణ్ ఆరోరా చెప్పారు. నగరంలోని అన్ని రైల్వేస్టేషన్లలోనూ, ఢిల్లీ-కాన్పూర్ మార్గంలో వెళ్లే అన్ని రైళ్లలోనూ సోదాలు చేశారు.