Jaise terrorists
-
4 మార్గాల్లోచొరబాటు..
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో శిక్షణ పొందుతున్న జైషే మహ్మద్ ఉగ్రవాదులు ప్రధానంగా నాలుగు భూమార్గాల ద్వారా భారత్‌లోకి చొరబడేందుకు ప్రణాళికలు రచించినట్లు రక్షణశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోకి ప్రవేశించి శాంతిభద్రతలకు తీవ్రవిఘాతం కలిగించేందుకు వీరంతా సిద్ధమయ్యారని వెల్లడించారు. బాలాకోట్–కేల్–దుధ్నియాల్, బాలాకోట్–కేల్–కైంతవాలీ, బాలాకోట్–కేల్–లోలబ్, బాలాకోట్–కేల్–కంచమ మార్గాలను ఉగ్రవాదులు తరచుగా వాడుతుంటారని పేర్కొన్నారు. జైషే ఉగ్రవాదులు సైతం ఈ మార్గంలోనే భారత్‌లోకి ప్రవేశించేందుకు కుట్ర పన్నారన్నారు. మదరసా ముసుగులో ఉగ్రశిక్షణ.. ‘మదరసా ఆయేషా సాదిక్’అనే ముసుగులో బాలాకోట్ ఉగ్రవాద స్థావరాన్ని జైషే మహ్మద్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ఉగ్రవాదులకు ఏకే–47, పీఐ మెషీన్‌గన్, రాకెట్ లాంఛర్, తేలికపాటి మెషీన్‌గన్, అండర్ బ్యారెల్ గ్రనేడ్ లాంఛర్ వినియోగించడంలో శిక్షణ ఇచ్చేవారు. అంతేకాకుండా అటవీప్రాంతంలో మనుగడ సాగించడం, నక్కి దాడిచేయడం, కమ్యూనికేషన్స్, జీపీఎస్, మ్యాప్ రీడింగ్‌తో పాటు ఈత కొట్టడం, కత్తి యుద్ధం, గుర్రపు స్వారీలో కూడా కఠోర శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. శిక్షణ సందర్భంగా గుజరాత్ గోద్రా మతఘర్షణలు, ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేయడం, బాబ్రీ మసీదు కూల్చివేత వంటి వీడియోతో ఉగ్రమూకలకు జైషే తమ భావజాలాన్ని నూరిపోసేదని రక్షణశాఖ ఉన్నతాధికారి తెలిపారు. ఈ క్యాంపును జైషేతో పాటు నిషేధిత హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు కూడా వినియోగించుకునేవారన్నారు. ఇక్కడ 325 ఉగ్రవాదులకు తోడు 25–27 మంది శిక్షకులు ఉండేవారని వెల్లడించారు. జైషే చీఫ్ మసూద్ అజహర్ ఇక్కడకు వచ్చి పలు ఉద్రేకపూరిత ప్రసంగాలు ఇచ్చేవాడన్నారు. బాలాకోట్‌పై దాడితో భారత్‌లో దాడులకు సిద్ధమవుతున్న ఉగ్రవాదులు ముందుగానే హతమయ్యారని పేర్కొన్నారు. -
కశ్మీర్లో ‘స్నైపర్’ కలకలం
శ్రీనగర్: కశ్మీర్ వ్యాలీలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు స్నైపర్ (దొంగచాటుగా) దాడులకు దిగడం భద్రతా దళాలను కలవరపరుస్తోంది. గత నెల నుంచి ఇప్పటివరకు ముగ్గురు భద్రతా సిబ్బంది స్నైపర్ దాడుల్లో మృతిచెందారు. దీంతో ఇలాంటి దాడులను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన వ్యూహాన్ని అవ లంబించాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. నిఘా అధికారుల సమాచారం మేరకు జైషే ఉగ్రవాదులు రెండు వేర్వేరు గ్రూపులను నిర్వహిస్తున్నారని నిర్ధారణకు వచ్చారు. ఈ రెండు గ్రూపుల్లో ఒక్కో దాంట్లో ఇద్దరు చొప్పున స్నైపర్లు కశ్మీర్ లోయలో సెప్టెంబర్ మొదటివారంలో ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం స్థానికుల సహాయంతో పుల్వామాలో ఆశ్రయం పొందినట్లు భావిస్తున్నారు. లోయలో స్నైపర్ దాడులు చేసేందుకు వీరంతా పాకిస్తాన్ ఐఎస్ఐ ద్వారా శిక్షణ పొం దారని, వీరి వద్ద అఫ్గానిస్తాన్‌లో యూఎస్ భద్రతా దళాలు ఉపయోగించే ఎమ్–4 కార్బైన్ ఆయుధాలున్నట్లు చెబుతున్నారు. -
భారత మీడియా అభాసుపాలు
‘మసూద్ అరెస్టు’పై దిగ్విజయ్ న్యూఢిల్లీ: జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ పాకిస్తాన్లో అరెస్టయ్యాడంటూ కథనాలు ప్రచురించి భారత మీడియా అభాసుపాలయిందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ ట్వీట్ చేశారు. అరెస్టును నిర్ధారించుకోకుండా, అధికారవర్గాల నుంచి ఎటువంటి వివరణ తీసుకోకుండా వార్తలు వెలువరించేశారన్నారు. అసలు మసూద్‌ను అరెస్టు చేయలేదని.. జైషే ఉగ్రవాదులు ముగ్గురిని ఏదో వేరే కేసులో పాక్ అధికారులు అరెస్టు చేశారని రక్షణశాఖ వర్గాలు చెప్పాయన్నారు. కానీ భారత మీడియా మాత్రం.. మసూద్‌ను పాక్ అరెస్టు చేసిందని మన విదేశాంగ, రక్షణ శాఖ అధికారులు లీక్ చేశారంటూ కథనాలు ఇచ్చాయన్నారు. అసలు పాక్ సంస్థలు కావాలనే అలాంటి ప్రచారం చేసి ఉంటాయని... దానికి మన మీడియా మోసపోయి, అభాసుపాలయిందని వ్యాఖ్యానించారు. మీడియా విశ్వసనీయత కంటే సంచలనం సృష్టించేందుకే ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. -
ఢిల్లీలో జైషే ఉగ్రవాదులు!
♦ భారీ దాడులకు కుట్ర ♦ అప్రమత్తమైన పోలీసులు న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలోకి చొరబడి దాడులకు పాల్పడిన పాకిస్తాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు.. దేశ రాజధాని ఢిల్లీనీ లక్ష్యంగా ఎంచుకున్నారు. జైషే మొహమ్మద్‌కు చెందిన ఇద్దరు మిలిటెంట్లు ఢిల్లీలోకి చొరబడ్డారని, వీరు భారీ దాడులకు, వీఐపీలను బందీలుగా పట్టుకునేందుకు కుట్ర పన్నారని నిఘా విభాగం ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులుగానీ, వస్తువులు గానీ కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కమిషనర్ బీఎస్ బస్సీ కోరారు. నిఘా సమాచారం నేపథ్యంలో బస్సీ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటుచేశారని, మరిన్ని కేంద్ర బలగాల సహకారం కోరారని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇద్దరు జైషే మొహమ్మద్ కీలక సభ్యులు చొరబడినట్లు సమాచారమొచ్చిందన్నారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లతోపాటు ఇతర ముఖ్యప్రాంతాల్లో భద్రతను పెంచారు. ఢిల్లీలోని ముఖ్యమైన మార్కెట్లు, వీఐపీలుండే లూటెన్స్ ఢిల్లీలోనూ నిఘా తీవ్రం చేశారు. శతాబ్ది రైలుకు బాంబు బెదిరింపు.. ఢిల్లీ-కాన్పూర్ మధ్య తిరిగే రైళ్లలో బాంబు పెట్టినట్లు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘజియాబాద్ వద్ద ఆదివారం ఉదయం ఢిల్లీ-లక్నో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను ఆపి సోదాలు చేశారు. బాంబు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. గంటన్నరపాటు రైలును నిలిపివేయడంతో ఆ మార్గంలోని రైళ్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. శతాబ్ది, దురంతో, రాజధాని, వైశాలి, నీలాంచల్ ఎక్స్‌ప్రెస్‌లకు బాంబు బెదిరింపు వచ్చిందని ఢిల్లీ డివిజనల్ రైల్వే మేనేజర్ అరుణ్ ఆరోరా చెప్పారు. నగరంలోని అన్ని రైల్వేస్టేషన్లలోనూ, ఢిల్లీ-కాన్పూర్ మార్గంలో వెళ్లే అన్ని రైళ్లలోనూ సోదాలు చేశారు.