భారత మీడియా అభాసుపాలు
‘మసూద్ అరెస్టు’పై దిగ్విజయ్
న్యూఢిల్లీ: జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ పాకిస్తాన్‌లో అరెస్టయ్యాడంటూ కథనాలు ప్రచురించి భారత మీడియా అభాసుపాలయిందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ ట్వీట్ చేశారు. అరెస్టును నిర్ధారించుకోకుండా, అధికారవర్గాల నుంచి ఎటువంటి వివరణ తీసుకోకుండా వార్తలు వెలువరించేశారన్నారు.
అసలు మసూద్‌ను అరెస్టు చేయలేదని.. జైషే ఉగ్రవాదులు ముగ్గురిని ఏదో వేరే కేసులో పాక్ అధికారులు అరెస్టు చేశారని రక్షణశాఖ వర్గాలు చెప్పాయన్నారు. కానీ భారత మీడియా మాత్రం.. మసూద్‌ను పాక్ అరెస్టు చేసిందని మన విదేశాంగ, రక్షణ శాఖ అధికారులు లీక్ చేశారంటూ కథనాలు ఇచ్చాయన్నారు.
అసలు పాక్ సంస్థలు కావాలనే అలాంటి ప్రచారం చేసి ఉంటాయని... దానికి మన మీడియా మోసపోయి, అభాసుపాలయిందని వ్యాఖ్యానించారు. మీడియా విశ్వసనీయత కంటే సంచలనం సృష్టించేందుకే ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు.