
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో శిక్షణ పొందుతున్న జైషే మహ్మద్ ఉగ్రవాదులు ప్రధానంగా నాలుగు భూమార్గాల ద్వారా భారత్‌లోకి చొరబడేందుకు ప్రణాళికలు రచించినట్లు రక్షణశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోకి ప్రవేశించి శాంతిభద్రతలకు తీవ్రవిఘాతం కలిగించేందుకు వీరంతా సిద్ధమయ్యారని వెల్లడించారు. బాలాకోట్–కేల్–దుధ్నియాల్, బాలాకోట్–కేల్–కైంతవాలీ, బాలాకోట్–కేల్–లోలబ్, బాలాకోట్–కేల్–కంచమ మార్గాలను ఉగ్రవాదులు తరచుగా వాడుతుంటారని పేర్కొన్నారు. జైషే ఉగ్రవాదులు సైతం ఈ మార్గంలోనే భారత్‌లోకి ప్రవేశించేందుకు కుట్ర పన్నారన్నారు.
మదరసా ముసుగులో ఉగ్రశిక్షణ..
‘మదరసా ఆయేషా సాదిక్’అనే ముసుగులో బాలాకోట్ ఉగ్రవాద స్థావరాన్ని జైషే మహ్మద్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ఉగ్రవాదులకు ఏకే–47, పీఐ మెషీన్‌గన్, రాకెట్ లాంఛర్, తేలికపాటి మెషీన్‌గన్, అండర్ బ్యారెల్ గ్రనేడ్ లాంఛర్ వినియోగించడంలో శిక్షణ ఇచ్చేవారు. అంతేకాకుండా అటవీప్రాంతంలో మనుగడ సాగించడం, నక్కి దాడిచేయడం, కమ్యూనికేషన్స్, జీపీఎస్, మ్యాప్ రీడింగ్‌తో పాటు ఈత కొట్టడం, కత్తి యుద్ధం, గుర్రపు స్వారీలో కూడా కఠోర శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. శిక్షణ సందర్భంగా గుజరాత్ గోద్రా మతఘర్షణలు, ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేయడం, బాబ్రీ మసీదు కూల్చివేత వంటి వీడియోతో ఉగ్రమూకలకు జైషే తమ భావజాలాన్ని నూరిపోసేదని రక్షణశాఖ ఉన్నతాధికారి తెలిపారు.
ఈ క్యాంపును జైషేతో పాటు నిషేధిత హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు కూడా వినియోగించుకునేవారన్నారు. ఇక్కడ 325 ఉగ్రవాదులకు తోడు 25–27 మంది శిక్షకులు ఉండేవారని వెల్లడించారు. జైషే చీఫ్ మసూద్ అజహర్ ఇక్కడకు వచ్చి పలు ఉద్రేకపూరిత ప్రసంగాలు ఇచ్చేవాడన్నారు. బాలాకోట్‌పై దాడితో భారత్‌లో దాడులకు సిద్ధమవుతున్న ఉగ్రవాదులు ముందుగానే హతమయ్యారని పేర్కొన్నారు.