హైకోర్టులో జైట్లీ, జెఠ్మలానీ వాగ్యుద్ధం
కేజ్రీవాల్‌పై వేసిన పరువునష్టం కేసు విచారణ సందర్భంగా...
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు సాక్షిగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, సీనియర్ అడ్వొకేట్ రామ్ జెఠ్మలానీ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నాయ కులు రాఘవ్ చద్దా, కుమార్ విశ్వాస్, అశుతోష్ సంజయ్ సింగ్, దీపక్ బాజ్‌పాయ్ లకు వ్యతిరేకంగా జైట్లీ ఢిల్లీ హైకోర్టులో రూ. 10 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో జరిగిన ఆర్థిక అవకతవకలకు 2000 నుంచి 2013 వరకు దాని అధ్యక్షుడిగా పనిచేసిన జైట్లీయే బాధ్యుడని ఆప్ నాయకులు ఆరోప ణలు చేసిన నేపథ్యంలో జైట్లీ ఈ దావా వేశా రు. ఈ కేసు విచారణ సందర్భంగా బుధ వా రం కేజ్రీవాల్ తరఫు న్యాయవాది జెఠ్మ లానీ, జైట్లీ మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది.
నిందలకూ ఓ హద్దుంటుంది: జైట్లీ
ఈ సందర్భంగా జైట్లీని నిజాయితీ లేని వ్యక్తి అంటూ రామ్‌జెఠ్మలానీ పరుష పదజాలాన్ని వినియోగించారు. దీంతో జాయింట్ రిజిస్ట్రార్ దీపాలీ శర్మ సాక్షిగా జైట్లీ సహనం కోల్పోయారు. కేజ్రీవాల్ సూచనల మేరకే ఆ పదం ఉపయోగించారా అని జెఠ్మలానీని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. అదే నిజమైతే కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఇంతకు మించిన పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుంద న్నారు. వ్యక్తిగతంగా నిందించడానికీ ఓ హద్దుంటుందని.. నియంత్రణ కోల్పోవడం సరైంది కాదన్నారు.
జైట్లీ తరఫు సీనియర్ అడ్వొకేట్లు రాజీవ్ నాయర్, సందీప్ సేథి కూడా జెఠ్మలానీ తీరును ఖండించారు. ఆయ న అవమానకరమైన ప్రశ్నలను వేశారని, అసంబద్ధమైన విషయాలను అడగకుండా తనను తాను నియంత్రించుకోవాలన్నారు. ఇది జైట్లీ, కేజ్రీకి మధ్య కేసు అని, జైట్లీ, జెఠ్మలానీ మధ్య జరుగుతున్న కేసు కాదని వ్యంగ్యంగా అన్నారు. కేజ్రీవాల్ సూచనల మేరకే ఆ పదం ఉపయోగించానని రామ్ జెఠ్మలానీ చెప్పగా.. కేజ్రీవాల్ తరఫు మరో న్యాయవాది అనుపమ్ శ్రీవాస్తవ్ ఆ పదం ఉపయోగించాలన్న సూచనేదీ లేదన్నారు.