ఆదాయపు పన్ను దాఖలు కేసు విచారణ వేగం పుంజుకుంది. కోర్టుకు హాజరు కావాల్సిందేనని సీఎం జయలలిత, ఆమె నెచ్చె లి శశికళలకు ఎగ్మూర్ ఆర్థిక నేరాల కోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ నెల 9న తప్పని సరిగా కోర్టుకు రావాల్సిందేనని నోటీసు జారీ చేసింది. సాక్షి, చెన్నై : రాష్ర్ట ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, ఆమె నెచ్చిలి శశికళతో పాటుగా బంధువులపై పలు కేసులు ఉన్న విషయం తెలిసిందే. ఏళ్ల తరబడి వాయిదాల మీద వాయిదాలతో ఈ కేసుల విచారణలు సాగుతూ వస్తున్నాయి. ఇందులో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, ఆదాయ పన్ను ఎగవేత కేసు ప్రధానమైనవి. ఒకటి బెంగళూరులోను, మరొకటి చెన్నై ఎగ్మూర్ కోర్టులోను 18 సంవత్సరాలుగా సాగుతున్నాయి.
ఇది ఐటీ కేసు : జయలలిత, శశికళ భాగస్వామ్యం తో నడుపుతున్న శశి ఎంటర్ ప్రెజైస్‌కు సంబంధించి 1991-92,1992-93 సంవత్సరానికి గాను ఆదాయ పన్ను రిటర్న్స్‌దాఖలు చేయలేదు. అలాగే, 1993-94కు గాను జయలలిత, శశికళ వ్యక్తిగతంగా తమ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేదు. దీన్ని డీఎంకే సర్కారు గుర్తించింది. ఆ ఇద్దరిపై కొరడా ఝుళిపించే పనిలో పడింది. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేదంటూ ఆ ఇద్దరిపై అభియోగం మోపుతూ కేసు నమోదు చేశారు.ఏళ్ల తరబడి విచారణ : ఆదాయపు పన్ను ఎగవేత వ్యవహారం చెన్నై ఎగ్మూర్ ప్రధాన మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో ఆర్థిక నేరాల విచారణ కోర్టులో సాగుతోంది. ఏళ్ల తరబడి వాయిదాల మీద వాయిదాలతో విచారణ సాగుతోంది. కొన్నేళ్లు విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
ఈ కేసు నుంచి తమకు విముక్తి కలిగించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన జయలలిత, శశికళలకు చుక్కెదురైంది. సుప్రీం కోర్టుకు వెళ్తే ఎదురు దెబ్బ తగిలింది. నాలుగు నెలల్లో విచారణను ముగించాలంటూ ఎగ్మూర్ కోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో విచారణ వేగం పెరిగింది. నెలన్నర రోజుల క్రితం కోర్టుకు రావాలం టూ జయలలిత, శశికళను న్యాయమూర్తి దక్షిణామూర్తి ఆదేశించారు. అయితే, ఎన్నికల కాలం కావడంతో విచారణ నుంచి తప్పించుకున్నారు. ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపించి విచారణను వాయిదా వేయించుకున్నా, కోర్టు కనుసన్నల్లో నుంచి తప్పించుకునే అవకాశాలు మాత్రం వారికి దక్కేలా లేదు.
ప్రస్తుతం ఎన్నికలు ముగిశాయి. కోడ్ లేదు. ఇక కోర్టుకు రావాల్సిందేనంటూ కోర్టు ఆదేశించింది. మంగళవారం ఈ కేసు విచారణకు రాగా, మళ్లీ వాయిదాకు ఇద్దరి తరపు న్యాయవాదులు యత్నించారు. జూలైకు విచారణను వాయిదా వేయాలంటూ వారు చేసుకున్న విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసి పుచ్చారు. ఆదాయపు పన్ను శాఖ తరపున హాజరైన న్యాయవాది రామస్వామి తనవాదన విన్పించారు. సమయం కావాలంటూ పదే పదే విచారణ వాయిదా వేసుకుంటూ వెళుతున్నారని, సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు సమీపిస్తున్నదని గుర్తు చేశారు. వాయిదా వేయాల్సిందేనని పట్టుబట్టిన జయలలిత, శశికళ తరపు న్యాయవాదులకు చివరకు చుక్కెదురయ్యింది. న్యాయమూర్తి దక్షిణామూర్తి స్పందిస్తూ, ఇప్పటికే సమయం ఇచ్చామని పేర్కొంటూ, ఆ ఇద్దరూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు ఇచ్చారు. ఈనెల 9 తేదీన జయలలిత, శశికళ తప్పని సరిగా విచారణ నిమిత్తం కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
జయ, శశికళకు నోటీసులు
Published Tue, Jun 3 2014 11:06 PM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM
Advertisement
Advertisement