అమ్మ గుండె ఆగిందా.. గుండెపోటు వచ్చిందా?
అమ్మ గుండె ఆగిందా.. గుండెపోటు వచ్చిందా?
Published Mon, Dec 5 2016 10:03 AM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు వచ్చినది గుండెపోటు కాదని.. ఆమె గుండె కొద్దిసేపు ఆగిందని (కార్డియాక్ అరెస్ట్) అపోలో ఆస్పత్రి వర్గాలు విడుదల చేసిన నోట్‌లో పేర్కొన్నాయి. ఈ కారణంగానే ఆమెకు సోమవారం ఉదయం ఒక ఆపరేషన్ కూడా జరిగినట్లు పార్టీ ప్రతినిధి సీఆర్ సరస్వతి తెలిపారు. కార్డియాక్ అరెస్టుకు, గుండెపోటుకు నిజానికి చాలా తేడా ఉంది. ఆ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
కార్డియాక్ అరెస్టు
శరీరంలోని వివిధ భాగాలకు రక్తసరఫరాను గుండె ఆపేసినప్పుడు కార్డియాక్ అరెస్టు సంభవిస్తుంది. పేషెంటు ఉన్నట్టుండి కుప్పకూలి, సాధారణంగా ఊపిరి తీసుకోకపోవడం, స్పందనలు లేకపోవడం లాంటి లక్షణాలు ఇందులో సంభవిస్తాయి.
కారణం ఏంటి?
చాలావరకు వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ (వీఎఫ్).. అంటే, గుండె లయ అసాధారణంగా మారడం వల్లే కార్డియాక్ అరెస్టు సంభవిస్తుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. గుండెకు సంబంధించిన ఎలక్ట్రికల్ యాక్టివిటీ దారుణంగా పడిపోయినపుడు ఈ పరిస్థితి వస్తుంది. దానివల్ల శరీర భాగాలకు గుండె నుంచి రక్త సరఫరా జరగదు.
కార్డియాక్ అరెస్టు తర్వాత కోలుకుంటారా?
వెంటనే సరైన చికిత్స అందిస్తే, కార్డియాక్ అరెస్టు నుంచి కూడా కోలుకునే అవకాశాలున్నాయి. చెస్ట్ వాల్ ద్వారా డీఫిబ్రిలేటర్ అనే పరికరంతో విద్యుత్ షాక్‌లు ఇచ్చి కొన్ని సందర్భాల్లో దీన్ని సరిచేస్తారు.
గుండెపోటు-కార్డియాక్ అరెస్టు తేడా ఏంటి?
గుండెపోటు వల్ల కూడా కార్డియాక్ అరెస్టు సంభవించవ్చు గానీ, ఈ రెండూ ఒకటి మాత్రం కాదు. గుండెపోటు అంటే గుండె కండరాలకు రక్తసరఫరాకు ఉన్నట్టుండి ఆటంకం కలగడం. దానివల్ల గుండెనొప్పి వచ్చి, గుండెకు శాశ్వతంగా నష్టం జరిగే అవకాశం ఉంది. కానీ.. అప్పటికీ మిగిలిన రక్తనాళాల ద్వారా గుండె మాత్రం శరీర భాగాలకు రక్తం సరఫరా చేస్తూనే ఉంటుంది, అందువల్ల పేషెంటు ఊపిరి తీసుకుంటూనే ఉంటాడు. కానీ కార్డియాక్ అరెస్టులో మాత్రం శరీరభాగాలకు రక్తం అందదు. గుండెపోటు, కార్డియాక్ అరెస్టు రెండూ ప్రాణాంతకమే. అయితే తక్షణ చికిత్స అందిస్తే మాత్రం కొంత ప్రయోజనం ఉండే అవకాశం ఉంది.
Advertisement