పట్నా: బీహార్‌లో జేడీయూ, దాని మిత్రపక్షాలు.. మాంఝీ సర్కారు, గవర్నర్‌పై విరుచుకుపడ్డాయి. మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడేందుకు గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీ యత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తాయి. మరికొద్ది రోజుల్లో గద్దె దిగబోయే ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ.. రోజుకో ప్రజాకర్షక పథకం ప్రకటిస్తూ రాష్ట్రంపై ఆర్థిక భారం పెంచుతున్నారని విమర్శలు గుప్పించాయి. గవర్నర్ తీరు, బీజేపీ నీచ రాజకీయాల వల్లే రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని మండిపడ్డాయి.
జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు వశిష్ట నారాయణ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘మాంఝీ సర్కారు బలం నిరూపించుకునేందుకు గవర్నర్ ఇంత సమయం ఇవ్వడం దారుణం. రాజాంగబద్ధ హోదాలో ఉన్న గవర్నర్ బీజేపీ కనుస్నల్లో నడుచుకుంటున్నారు. మాంఝీ సర్కారు ఖజానాపై పెనుభారం మోపుతూ రోజుకో కొత్త పథకం ప్రకటిస్తున్న గవర్నర్ చోద్యం చూస్తున్నారు. విశ్వాస పరీక్షలో నెగ్గే వరకూ ఎలాంటి విధాననపర నిర్ణయాలు తీసుకోకుండా సీఎంను గవర్నర్ నిలువరించాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.