ఫిరాయింపులు జాడ్యంలా విస్తరించాయి
జేడీ(యూ) సీనియర్ నేత శరద్‌యాదవ్ వెల్లడి
న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: పార్టీ ఫిరాయింపులు ఒక జాడ్యంలా దేశమంతటా విస్తరించాయని జనతాదళ్(యునెటైడ్) సీనియర్ నేత శరద్‌యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ప్రజాప్రతినిధుల బృందం మంగళవారం ఢిల్లీలో ఆయనతో సమావేశమైంది. ఏపీలో కొనసాగుతున్న అనైతిక రాజకీయాల గురించి వివరించింది. వైఎస్సార్‌సీపీ చేస్తున్న పోరాటానికి శరద్‌యాదవ్ మద్దతు ప్రకటించారు. భేటీ అనంతరం ఆయన జగన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. శరద్ యాదవ్ ఏమన్నారంటే... ‘‘ఫిరాయింపులు జాడ్యంలా దేశవ్యాప్తంగా విస్తరించాయి.
ఈ జాడ్యం ఆంధ్రప్రదేశ్‌లో మరీ ఎక్కువగా విస్తరించింది. అధికార పార్టీకి చెందిన వ్యక్తే స్పీకర్‌గా ఉండటం వల్లే ఫిరాయింపులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగానే పార్టీ ఫిరాయింపులు యథేచ్ఛగా సాగుతున్నాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా వైఎస్సార్‌సీపీ చేస్తున్న పోరాటానికి మా మద్దతు ఉంటుంది. ఏపీలో అనైతిక రాజకీయ కార్యకలాపాలు, చంద్రబాబు సాగిస్తున్న అవినీతి గురించి వైఎస్సార్‌సీపీ బృందం నాకు వివరించింది. వినతిపత్రం, అవినీతి చక్రవర్తి చంద్రబాబు పుస్తకాన్ని అందించింది. వాటిని క్షుణ్నంగా చదువుతాను’’ అని చెప్పారు.