సాక్షి, న్యూఢిల్లీ : గణతంత్ర వేడుకల సందర్భంగా దేశ రాజధానిలో ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు రూపొందించారనే ఆరోపణలపై ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ సభ్యులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని అబ్దుల్ లతీఫ్ ఘనీ, హిలాల్ అహ్మద్ భట్‌లుగా గుర్తించారని ఢిల్లీ పోలీస్ అధికారులు వెల్లడించారు. వీరు జమ్మూ కశ్మీర్‌కు చెందిన వకుర, బటపోరా ప్రాంతానికి చెందిన వారని తెలిపారు.
మిలటరీ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారంతో ఢిల్లీలోని లక్ష్మీనగర్‌లో ఓ ఇంటిలోకి కొందరు అనుమానితులు వస్తున్నారని పసిగట్టిన పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో రాజ్‌ఘాట్‌లో కొందరిని కలిసేందుకు ఘనీ వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు అక్కడ మాటు వేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఘనీ నుంచి ఆయుధాలు, కొంత మెటీరియల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఘనీ అనుచరులను పట్టుకునేందుకు జమ్ము కశ్మీర్ వెళ్లిన ప్రత్యేక బృందం బండిపోరలో మరో ఉగ్రవాది అహ్మద్ భట్‌ను అరెస్ట్ చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్ర దాడులకు సన్నాహకంగా ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో భట్ రెక్కీ నిర్వహించినట్టు పోలీసులు వెల్లడించారు. విచారణలో భాగంగా తాము జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలో చురుకుగా పనిచేస్తామని వారు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment