
ఉగ్రవాద రిక్రూట్‌మెంట్ పెరిగింది!
న్యూఢిల్లీ: హిజ్బుల్ ముజాహిద్దీన్ లీడర్ బుర్హాన్ వాని ఎన్‌కౌంటర్ తరువాత కశ్మీర్‌లో ఉగ్రవాదం వైపు మళ్లిన యువత సంఖ్య పెరిగింది. 2016 జులై 8న బుర్హాన్ వాని ఎన్‌కౌంటర్ అనంతరం కశ్మీర్‌లోయలో సెప్టెంబర్ వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో యువత ఉగ్రవాదంవైపు అడుగులేసినట్లు ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించిన వివరాల ఆధారంగా తేటతెల్లమవుతోంది.
2016లో 88 మంది యువత ఉగ్రవాదుల్లో చేరినట్లు మంగళవారం లోక్‌సభలో ప్రభుత్వం వెల్లడించింది. జిహాదీలుగా మారిన యువత సంఖ్య 2010 సంవత్సరం నుంచి ఇదే ఎక్కువ కావడం గమనార్హం. హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ వెల్లడించిన వివరాల ప్రకారం జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం వైపు మళ్లిన యువత సంఖ్య 2015లో 66 ఉండగా, 2014లో 53, 2013లో 16, 2012లో 21, 2011లో 23, 2010లో 54గా ఉంది. యువత ఉగ్రవాదం వైపు వెళ్లకుండా జమ్మూకశ్మీర్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అహిర్ తెలిపారు.