'జాతి వ్యతిరేక కార్యక్రమాలను సహించేది లేదు'
న్యూఢిల్లీ:
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ)లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతి వ్యతిరేక కార్యక్రమాలను సహించేది లేదని శుక్రవారం స్పష్టం చేశారు. భారత దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా నినాదాలు, దేశ సమగ్రతను ప్రశ్నించడంలాంటివి చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని పేర్కొన్నారు. జేఎన్‌యూలో ఘటనలో బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు.
పార్లమెంటుపై దాడి కేసులో మరణశిక్షకు గురైన అఫ్జల్ గురు ఉరితీతకు వ్యతిరేకంగా, కశ్మీరీ ప్రజల పోరాటానికి మద్దతుగా.. జేఎన్‌యూలో మంగళవారం సాయంత్రం పలువురు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించటంపై వర్సిటీ పాలకవర్గం క్రమశిక్షణా విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమం దేశ వ్యతిరేకమైన కార్యక్రమమని..అనుమతి రద్దు చేసినా కార్యక్రమాన్ని నిర్వహించారని, అందుకు బాధ్యులైన విద్యార్థులను బహిష్కరించాలని డిమాండ్ రావడంతో వర్సిటీ పాలకవర్గం విచారణకు ఆదేశించింది.