ఫిరాయింపులు అప్రజాస్వామికం: జేపీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ మారేలా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం అప్రజాస్వామికం, అనైతికమని లోక్‌సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆయన సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచి, అధికారంలో ఉన్న పార్టీలోకి ఫిరాయించడాన్ని ఒక వ్యాపారంగా భావిస్తున్నారని ఆరోపించారు. ‘‘రాజకీయాలు, డబ్బును సమానంగా చూసేవారిని, ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చుపెట్టేవారిని, ఎన్నికయ్యాక రూ.కోట్లు సంపాదించుకునే వారినే పార్టీలు ఎంచుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పార్టీలు ఎలాంటి వారికి టిక్కెట్లిచ్చాయి? వారు సమయం రాగానే అధికార పక్షంవైపు వెళ్లిపోయారు. రేపు మరోపార్టీ అధికారంలోకి వస్తే అందులో చేరిపోతారు. సామర్థ్యం, నైతిక విలువలు, సమాజంలో గౌరవం ఉన్నవారు ఏ పార్టీలో ఉన్నా అభివృద్ధి పనులు చేయగలరు’’ అని జేపీ చెప్పారు. ‘‘స్పీకర్ అధికార పార్టీకి చెందిన మనిషి కాబట్టి ఫిరాయింపుదారులకు అడ్డుచెప్పే వారే కనిపించడం లేదు. స్పీకర్ చేతిలో అధికారం ఉన్నంత కాలం ఇలాగే ఉంటుంది. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకొనే అధికారాన్ని ఎన్నికల సంఘానికి, గవర్నర్‌కు కల్పించాలి. ఎన్నికల సంఘాన్ని సంప్రదించి గవర్నర్ నిర్ణయం తీసుకునే విధానాన్ని అమలు చేయాలి’’ అని స్పష్టం చేశారు.