
నద్దాకే పార్టీ పగ్గాలు!
బీజేపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ జేపీ నద్దాకే పార్టీ అధ్యక్ష పదవి లభించే అవకాశముందని తెలుస్తోంది. అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ మోడీ ప్రభుత్వంలో చేరే అవకాశముండటంతో.. ఆయన వారసుడెవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. మోడీకి సన్నిహితుడైన అమిత్‌షాకు, పార్టీ మాజీ చీఫ్ గడ్కారీకి నద్దా అత్యంత సన్నిహితుడు కావడం ఆయనకు అనుకూలించే అంశం. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన నద్దా ఆరెస్సెస్‌కు విశ్వాస పాత్రుడని, అందువల్ల ఆరెస్సెస్ కూడా నద్దా వైపే మొగ్గు చూపుతోందని తెలుస్తోంది.
పార్టీ విద్యార్థి విభాగం ఏబీవీపీ, యువ విభాగం భారతీయ యువమోర్చాల్లో నద్దా పనిచేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ.. లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 4 స్థానాలను బీజేపీ గెలుచుకోవడంలో నద్దా కీలకపాత్ర పోషించారు. అయితే, పార్టీలో పెద్దగా ప్రచారంలేని నద్దాకు అధ్యక్ష పదవి అప్పగించాలనుకోవడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు.