బాబు సర్కార్‌ను బర్తరఫ్ చేయాలి
- సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ డిమాండ్
- సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు రాజ్యాంగ విరుద్ధం
- ఆర్టికల్–356 ప్రయోగించి శాసనసభను రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించాలి
- రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలకు లేఖలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ డిమాండ్ చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలపై ఉక్కుపాదం మోపుతూ, వారిని అరెస్ట్‌లు చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వంపై ఆర్టికల్–356ని వినియోగించాలని డిమాండ్ చేశారు. ఏపీ శాసనసభను రద్దు చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలకు ఆయన బుధవారం లేఖలు రాశారు.
‘పొలిటికల్ పంచ్’ అడ్మిన్ రవికిరణ్ అరెస్టు, సోషల్ మీడియా కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వ అణచివేత, ప్రజల హక్కులు కాలరాయడం, దుర్మార్గపు అరెస్టులపై జస్టిస్ కట్జూ ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం అని... ప్రభుత్వాలను, రాజకీయ నాయకులను విమర్శించే హక్కు ప్రజలకు ఉందని తన లేఖలో పేర్కొన్నారు. కార్టూన్లను రూపొందించడం, ప్రచురించడం అర్టికల్ 19(1)(ఎ)ద్వారా ప్రతి పౌరుడికి రాజ్యాంగం అందించిన భావస్వేచ్ఛ హక్కులో భాగమేనని తెలిపారు. సోషల్ మీడియా కార్యకర్తల విషయంలో టీడీపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా, నిరంకుశంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని స్పష్టంచేశారు.
అందువల్ల అర్టికల్–356 కింద ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. టీడీపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, శాసనసభ ను రద్దు చేయాలని, తాజాగా ఎన్నికలు నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్రపతికి రాసిన లేఖలో డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్న నెటిజన్ల హక్కులను టీడీపీ ప్రభుత్వం కాలరాస్తోందని, సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్‌లు చేస్తూ అనాగరికంగా వ్యవహరిస్తోందని లేఖలో పేర్కొన్నారు. తాజాగా మంగళవారం బెంగళూరులో ఐటీ ఉద్యోగి ఇప్పాల రవీంద్రను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకమని కట్జూ ట్వీటర్‌లో వ్యాఖ్యానించారు. ఏపీలోని రాజకీయ పరిణామాలపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలను జీర్ణించుకోలేని టీడీపీ ప్రభుత్వం పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేసి కేసులు పెడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ‘పొలిటికల్ పంచ్’ అడ్మిన్ రవికిరణ్‌ను అరెస్ట్ చేసిన ప్రభుత్వం, తాజాగా మరో సోషల్ మీడియా కార్యకర్త రవీంద్ర ఇప్పాలను బెంగళూరులో అరెస్ట్ చేసింది.