సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుకు నాలుగేళ్లుగా అభ్యర్థిస్తున్నా ఫలితం లేదని, విభజన చట్టంలోని హామీలను ఇప్పటికైనా అమలు చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోరారు. విశ్వనగరంగా ఆవిర్భవిస్తున్న హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలని సీఎంతో సహా అభ్యర్థిస్తున్నా ఇప్పటివరకు ముందడుగు పడలేదన్నారు. కడియం శ్రీహరి సారథ్యంలో టీఆర్‌ఎస్ ఎంపీల బృందం గురువారం జవదేకర్‌ను కలసి విభజన చట్టం హామీలపై చర్చించింది.
అనంతరం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియాతో కడియం మాట్లాడుతూ.. ‘ఏపీ విభజన జరిగి నాలుగేళ్లయినా తెలంగాణకు ఇప్పటివరకు గిరిజన వర్సిటీ మంజూరు చేయలేదని జవదేకర్‌కు వివరించాం. దీని ఏర్పాటుకు భూమి, మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పాం. తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఐఐటీ, జేఈఈ పరీక్షలకు సిద్ధమవుతుంటారని.. గణితంపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లర్నింగ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, కరీంనగర్‌లో ఐఐఐటీ ఏర్పాటు చేయాలని విన్నవించాం’అని చెప్పారు.
14 కొత్త జిల్లాల్లో కేవీలు, నవోదయ విద్యాలయాలు లేవని వివరించగా మంత్రి స్పందిస్తూ.. కేంద్రం త్వరలో దేశవ్యాప్తంగా వాటిని మంజూరు చేయనుందని, అప్పుడు తెలంగాణకూ మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణలో వివిధ విద్యాసంస్థల ఏర్పాటుపై నాలుగేళ్లుగా అన్ని రకాలుగా అభ్యర్థనలు చేస్తున్నా కేంద్రం నుంచి స్పందన లేదని కడియం అన్నారు. మరో 9 నెలల్లో ఎన్నికలు వస్తున్నందున మేల్కొని విద్యాసంస్థల ఏర్పాటుకు ముం దుకు రావాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు. కేజీబీవీలను 12వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేసినందున మధ్యాహ్నం భోజన సదుపాయమూ కల్పించాలని కోరామని చెప్పారు.
తెలంగాణకు హోదా ఇవ్వాలి
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని వర్కింగ్ కమిటీలో కాంగ్రెస్ తీర్మానించిందని.. తెలంగాణకూ హోదా ఇచ్చేలా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ అధిష్టానంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తీసుకురావాలన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏపీకి హోదా ఇచ్చినట్లయితే అవే రాయితీలు తెలంగాణకు ఇవ్వాలని.. ఏపీకి హోదా ఇచ్చి తెలంగాణకు ఇవ్వకుంటే తాము నష్టపోతామన్నారు. ఏపీతో తెలంగాణ పోటీ పడడం లేదని, అసలు ఏపీ పోటీ కాదన్నారు. ఏపీనే తెలంగాణను పోటీగా భావిస్తోందని కడియం పేర్కొన్నారు. ఎంపీలు వినోద్‌కుమార్, బాల్క సుమన్, సంతోష్, బడుగు లింగయ్య యాదవ్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment