Prakash Javedkar
-
ప్రభుత్వ నియామకాలపై కేబినెట్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భారీ మార్పునకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కామన్ ఎలిజిబిలిటీ పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఎన్ఆర్ఏ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో 1517 కోట్ల రూపాయల కేటాయింపుతో ఎన్ఆర్ఏ ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదించింది. అన్ని ఉద్యోగాలకు ఉమ్మడి సిలబస్‌తో ఉమ్మడి పరీక్షను నిర్వహిస్తారు. కాగా, ఈ నిర్ణయం దేశంలో ఉద్యోగాలు కోరుకునే యువతకు తోడ్పాటు అందిస్తుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి ఎన్ఆర్ఏ ఒకే ఎంట్రన్స్ పరీక్షను నిర్వహిస్తుంది. రిక్రూట్మెంట్ బోర్డులు తుది పరీక్షలు నిర్వహిస్తాయి. ఒకసారి పరీక్ష రాస్తే మూడేళ్లపాటు మార్కులకు వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతి జిల్లాలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసి కంప్యూటర్ ద్వారా ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం నియామక పరీక్షలను యూపీఎస్సీ, ఎస్ఎస్సీ వంటి సంస్ధలు నిర్వహిస్తున్నాఆయి. ఇక ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో (పీపీపీ) మోడల్ కింద జైపూర్, తిరువనంతపురం, గౌహతి ఎయిర్‌పోర్టులను లీజుకు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్ట్‌లను ప్రైవేట్ డెవలపర్‌కు అప్పగించడం ద్వారా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు 1070 కోట్ల రూపాయలు సమకూరుతాయని మంత్రి తెలిపారు. ఈ మూడు ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధిని చేసేందుకు కేంద్రప్రభుత్వం డెవలపర్‌గా అదానీ గ్రూప్‌ను ఎంపిక చేసింది. చదవండి : ‘ఆరు నెలల్లో మీరు సాధించినవి ఇవే’ -
'జిన్నానా? భారతమాతానా? తేల్చుకోండి'
ఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ అక్కడి రాజకీయ నేతల్లో మరింత దూకుడు పెరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీని పాకిస్తాన్ తో, బీజేపీని ఇండియాతో పోల్చుతూ.. ఫిబ్రవరి 8న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఢీకొనబోతున్నాయంటూ బీజేపీ నేత కమల్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులిచ్చిన సంగతి మరువక ముందే ఢిల్లీ బీజేపీ ఇన్ చార్జిగా వ్యవహరిస్తోన్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌లో ఏర్పాటు చేపిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్‌లో డిసెంబర్ నుంచి నిరవధిక నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని ఎన్నికలకు ముడిపెడుతూ.. ఆ ఉద్యమం వెనుక చీకటి శక్తులు ఉన్నాయని, ఆ చీకటి శక్తులకు ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు అండగా నిలిచాయని కేంద్ర మంత్రి జవదేకర్ ఆరోపించారు. షాహీన్ బాగ్ లో నిరసనకారులు.. జిన్నా కోరిన స్వాతంత్ర్యం(జిన్నా వాలీ ఆజాదీ) అంటూ నినాదాలు చేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జిన్నా కావాలో? భారతమాతకు జై అంటారో ఢిల్లీ ఓటర్లు నిర్ణయించుకోవాలని జవదేకర్ పేర్కొన్నారు. (ఫిబ్రవరి 8న భారత్-పాక్ పోరు : కపిల్ మిశ్రా) -
జవదేకర్‌తో టీఆర్ఎస్ ఎంపీల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన పలు విద్యాసంస్థలపై చర్చించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో టీఆర్ఎస్ ఎంపీలు గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణలో విద్యా సంస్థల ఏర్పాటుపై చర్చించాం. సిద్దిపేట కేంద్రీయ విద్యాలయంలో సీట్ల సంఖ్య పెంచాలని కోరాం. మా విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు’అని వివరించారు. ఈ భేటీలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి, బీబీ పాటిల్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్ ముదిరాజ్ పాల్గొన్నారు. -
రిజర్వేషన్లపై నిర్ణయాధికారం రాష్ట్రాలకే ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని కేంద్రానికి టీఆర్ఎస్ ఎంపీలు విన్నవించారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయ మంత్రి థావర్ చంద్గెహ్లాట్ను వారు కలిశా రు. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేటాయించాలని, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఎన్సీబీసీ చైర్మన్‌ను నియమించాలని విన్నవించారు. కేంద్రమంత్రితో భేటీ అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ‘ఏక్ దేశ్–ఏక్ నీతి ఉండాలన్నదే మా అధినేత నినాదం. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాం. అయినా కేంద్రం ఇప్పటివరకు ఓబీసీలకు సంబంధించిన మంత్రిత్వ శాఖపై నిర్ణయం తీసుకోలేదు. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాలకే నిర్ణయాధికారం ఉండాలి. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విభిన్న రకాలుగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఎన్సీబీసీ ఏర్పాటు చేసి 9 నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చైర్మన్‌ను నియమించలేదు..’ అని టీఆర్ఎస్ ఎంపీలు మీడియాకు వివరించారు. ఐఐఎం ఏర్పాటుపై వినతి తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు టీఆర్ఎస్ ఎంపీలు విన్నవించారు. బుధవారం సాయంత్రం వారు మంత్రిని కలిశారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, కొత్త జిల్లాల్లో జిల్లాకో నవోదయ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కేంద్ర మంత్రులను కలసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఒత్తిడి పెంచుతున్నాం. నాలుగున్నరేళ్లుగా విద్యాసంస్థల ఏర్పాటుపై కేంద్రమంత్రిని అనేకసార్లు కలిశాం. అయినా స్పందించడం లేదు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై సీఎం కేసీఆర్ సైతం కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం జరిగిన సమావేశంలో మరోసారి గతంలో ఇచ్చిన హామీలను గుర్తుచేశాం..’అని టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత జితేందర్‌రెడ్డి మీడియాకు వివరించారు. కేంద్ర మంత్రులను కలసిన వారిలో ఎంపీలు కె.కవిత, బి.వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, నగేశ్, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్, ప్రకాశ్ ముదిరాజ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్.వేణుగోపాలాచారి ఉన్నారు. ఆ గుర్తులు కేటాయించొద్దు ఎన్నికల చిహ్నంగా ట్రక్కు, కెమెరా, ఇస్త్రీపెట్టె, హ్యాట్ గుర్తులను కేటాయించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాకు టీఆర్ఎస్ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. బుధవారం టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత జితేందర్‌రెడ్డి, ఎంపీ బి.వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్.వేణుగోపాలాచారి ప్రధాన కమిషనర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులకు ట్రక్కు, కెమెరా, ఇస్త్రీపెట్టె, హ్యాట్ తదితర గుర్తులు కేటాయించడంతో టీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్లిందని నివేదించారు. ఈ చిహ్నాలు టీఆర్ఎస్ గుర్తు కారును పోలి ఉండటంతో తమకు రావాల్సిన ఓట్లు ఆయా గుర్తులకు పోలయ్యాయని వివరించారు. ఎన్నికలకు ముందే ఈ అంశంపై సీఈసీకి నివేదించామని గుర్తుచేశారు. మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కారును పోలిన గుర్తులను కేటాయించవద్దని కోరారు. -
అర్థమయ్యేలా చెప్పడానికో పథకం!
రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండంటే రెండే నెలల్లో ఓ కొత్త పథకాన్ని తీసుకొస్తామని కేంద్ర మానవవనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ వాగ్దానం చేశారు. రాజస్తాన్ ఎన్నికల ఇంచార్జ్‌గా ఉన్న జవదేకర్.. జైపూర్‌లోని ఓ మురికివాడలోని ప్రచారానికి వెళ్లారు. అక్కడ ఓ ఇంట్లో ఓ బామ్మ, తాతయ్య దగ్గరికెళ్లి.. ‘బీజేపీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా?’అని అడిగారు. దీనికి అటు, ఇటూగా వారు సమాధానం చెప్పడంతో ప్రభుత్వ పథకాల కరపత్రాన్ని అందించారు. అయితే ‘అయ్యా! మేం చదువుకోలేదు. ఇందులో ఏముందో మాకు అర్థం కాదు’అని వాళ్లు సమాధానమిచ్చారు. దీనికి ఒక్క క్షణం ఆలోచించిన జవదేకర్ అక్కడున్న వాళ్ల మనవడు, మనవరాలిని పిలిచి.. నానమ్మ, తాతలకు చదవటం నేర్పించాలని సూచించారు. ‘బడికెళ్తున్న చిన్నారులు.. సమయం దొరికినపుడల్లా నిరక్షరాస్యులైన మీ పెద్దలకు చదువు నేర్చించాలి’అని సూచించారు. ఇందుకోసం రెండు నెలల్లో ఓ పథకాన్ని తీసుకొస్తామని ఆయన చెప్పారు. పెద్దలకు అర్థమయ్యేలా చెప్పేందుకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అక్కడ నీటి కొరతే ప్రతిపక్షం రాజస్తాన్‌లో అజ్మీర్ నగరంలో రెండ్రోజులకోసారి నల్లా నీళ్లొస్తాయి. అదీ అరగంట సేపే. అజ్మీర్ల్ వాసులు.. ఇలా రెండ్రోజులకోసారి నీళ్లు పొందడమే ఓ వైభోగం. ఎందుకంటే ఈ ప్రాంతంలో పెద్దగా నదుల్లేవు. ఉన్న చిన్నా చితకా వాగులు కూడా ఎప్పుడూ ఎండిపోయే ఉంటాయి. నీటికొరత తీర్చేందుకు ఏ ప్రభుత్వం దీర్ఘకాల కార్యాచరణతో పనిచేయలేదు. ఈసారి కొరత గతంలో కన్నా తీవ్రంగా ఉండటంతో.. నీటికొరతే ప్రభుత్వానికి అసలైన ప్రతిపక్షంగా మారనుంది. 2009లో ఇలాగే తీవ్ర దుర్భిక్షం ఎదురైనపుడు పౌర, కార్మిక సంఘాలు, మార్కెట్ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ‘నీరివ్వకుంటే ఓటేయబోం’అని ఉద్యమాన్ని లేవనెత్తాయి. ఇది నాటి వసుంధరా రాజే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. అజ్మీర్ తాగునీటి అవసరాల కోసమే బీసల్‌పూర్ డ్యామ్ కట్టారు. కానీ ప్రభుత్వం.. రాజకీయ అవసరాల కోసం ఈ నీటిని టోంక్, జైపూర్ నగరాలకు తరలించడం కారణంగానే ఇక్కడ కరువు ఏర్పడుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ఎన్నికల వేళ దర్గా దర్శనం రాజస్తాన్‌లోని మార్వార్ ప్రాంతం పేరు చెబితే బంజరు భూములు, వడగాలులు గుర్తొస్తాయి. కానీ ఈ ప్రాంతం ఆధ్యాత్మికతకు సూఫీ సంస్కృతికి, సాధువులకు అడ్డాగా ఉందన్న సంగతి చాలామందికి తెలియదు. ముఖ్యంగా నాగౌర్‌లోని 13వ శతాబ్దంనాటి ఖాజీ హమీదుద్దీన్ దర్గా చాలా ఫేమస్. ఇక్కడికి స్థానికంగా ఉండే ఆలయాల పూజారులు సహా అన్ని మతాలను విశ్వసించేవారు వస్తారు. ఎన్నికల సమయంలోనైతే ఈ దర్గా కు వచ్చి దర్శనం చేసుకోని పార్టీ ప్రతినిధులు, అభ్యర్థులు ఉండరనే చెప్పాలి. సుఫీ బాబా పార్టీలకతీతంగా రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులందరూ క్యూ కడతారు. అజ్మీర్ షరీఫ్ దర్గాలాగా దీనికి ప్రపంచ ప్రఖ్యాతి దక్కకపోయినా, ఎన్నికలప్పుడు మాత్రం బాగా సందడి ఉంటుంది. సుఫీ గురువైన ఖాజీ హమీదుద్దీన్ వెజిటేరియన్‌గానే జీవితం గడిపారని ఈ దర్గా సంరక్షకులు చెబుతారు. -
అభివృద్ధికి విఘాతమైన రాజకీయం తగదు
జేఎన్టీయూ(అనంతపురం): స్వాతంత్య్రం అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ‘సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ను ఏర్పాటు చేయడం శుభపరిణామమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. అభివృద్ధికి విఘాతం కలిగించే రాజకీయం తగదన్నారు. ఆయన ఆదివారం జేఎన్టీయూ–అనంతపురంలోని ఇంక్యుబేషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ తాత్కాలిక క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ యూనివర్సిటీలో పదేళ్లలో 5,000 మంది విద్యార్థులు విద్యనభ్యసించేలా ప్రత్యేకంగా చొరవ తీసుకుంటామని చెప్పారు. అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం జంతలూరు వద్ద 460 ఎకరాల్లో రూ.1,000 కోట్లతో శాశ్వత క్యాంపస్‌ను నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం భవన నిర్మాణాలకు రూ.460 కోట్లు వెచ్చిస్తామని తెలిపారు. మూడేళ్ల తర్వాత మరో రూ.500 కోట్లు మంజూరు చేస్తామన్నారు. నూతన విద్యాసంస్థలకు 100% గ్రాంట్లు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఉన్నత విద్యాసంస్థలను ఏపీలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు. ఉన్నత విద్య అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంఉదారంగా నిధులు మంజూరు చేస్తోందన్నారు. అయినప్పటికీ టీడీపీ మంత్రులు, ఎంపీలు రాజకీయాలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. విద్య పురోగతికి సంబంధించిన అంశాల పట్ల రాజకీయాలు చేయొద్దని చెప్పారు. నాణ్యనమైన ఉన్నత విద్య మాత్రమే మోదీ ప్రభుత్వానికి జాతీయ ఎజెండా అని, ఇంకే రకమైన ఎజెండాలు లేవని స్పష్టం చేశారు. జాతి నిర్మాణంలో రాజకీయాలు ఉండవని తేల్చి చెప్పారు. నూతనంగా ఏర్పడే విద్యాసంస్థలకు 100 శాతం గ్రాంట్లు తప్పనిసరిగా మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో విద్యకు రూ.3,600 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. 2015 జూన్‌లో తిరుపతిలో ఐఐటీని ప్రారంభించామని, ఇందుకోసం రూ.1,074 కోట్లు జారీ చేశామని గుర్తుచేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, విశాఖపట్నంలో ఐఐఎంను ప్రారంభించామన్నారు. నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: మంత్రి గంటా అనంతపురంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. వెంటనే రాష్ట్ర మంత్రితో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయించింది. ఈ సమావేశంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నీ అవాస్తవాలు చెప్పారని విమర్శించారు. ఏపీలో విద్యాసంస్థల నిర్మాణానికి రూ.వేల కోట్లు మంజూరు చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దీనిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇస్తామన్న నిధుల్లో 10 శాతం నిధులు కూడా విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. బహిరంగ సభ వేదికపై కేంద్ర మంత్రి గణాంకాలతో వివరాలు చెబుతుంటే మీరు ఎందుకు నిలదీయలేదని విలేకరులు అడగ్గా.. ‘‘ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి చివర్లో మాట్లాడుతారు. మా ప్రసంగం తర్వాత ఆయన మాట్లాడారు. కాబట్టి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు తెలియజేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. -
నాలుగేళ్లుగా అడుగుతున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుకు నాలుగేళ్లుగా అభ్యర్థిస్తున్నా ఫలితం లేదని, విభజన చట్టంలోని హామీలను ఇప్పటికైనా అమలు చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోరారు. విశ్వనగరంగా ఆవిర్భవిస్తున్న హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలని సీఎంతో సహా అభ్యర్థిస్తున్నా ఇప్పటివరకు ముందడుగు పడలేదన్నారు. కడియం శ్రీహరి సారథ్యంలో టీఆర్ఎస్ ఎంపీల బృందం గురువారం జవదేకర్‌ను కలసి విభజన చట్టం హామీలపై చర్చించింది. అనంతరం తెలంగాణ భవన్లో జరిగిన మీడియాతో కడియం మాట్లాడుతూ.. ‘ఏపీ విభజన జరిగి నాలుగేళ్లయినా తెలంగాణకు ఇప్పటివరకు గిరిజన వర్సిటీ మంజూరు చేయలేదని జవదేకర్‌కు వివరించాం. దీని ఏర్పాటుకు భూమి, మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పాం. తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఐఐటీ, జేఈఈ పరీక్షలకు సిద్ధమవుతుంటారని.. గణితంపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లర్నింగ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, కరీంనగర్లో ఐఐఐటీ ఏర్పాటు చేయాలని విన్నవించాం’అని చెప్పారు. 14 కొత్త జిల్లాల్లో కేవీలు, నవోదయ విద్యాలయాలు లేవని వివరించగా మంత్రి స్పందిస్తూ.. కేంద్రం త్వరలో దేశవ్యాప్తంగా వాటిని మంజూరు చేయనుందని, అప్పుడు తెలంగాణకూ మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణలో వివిధ విద్యాసంస్థల ఏర్పాటుపై నాలుగేళ్లుగా అన్ని రకాలుగా అభ్యర్థనలు చేస్తున్నా కేంద్రం నుంచి స్పందన లేదని కడియం అన్నారు. మరో 9 నెలల్లో ఎన్నికలు వస్తున్నందున మేల్కొని విద్యాసంస్థల ఏర్పాటుకు ముం దుకు రావాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు. కేజీబీవీలను 12వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేసినందున మధ్యాహ్నం భోజన సదుపాయమూ కల్పించాలని కోరామని చెప్పారు. తెలంగాణకు హోదా ఇవ్వాలి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని వర్కింగ్ కమిటీలో కాంగ్రెస్ తీర్మానించిందని.. తెలంగాణకూ హోదా ఇచ్చేలా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ అధిష్టానంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తీసుకురావాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏపీకి హోదా ఇచ్చినట్లయితే అవే రాయితీలు తెలంగాణకు ఇవ్వాలని.. ఏపీకి హోదా ఇచ్చి తెలంగాణకు ఇవ్వకుంటే తాము నష్టపోతామన్నారు. ఏపీతో తెలంగాణ పోటీ పడడం లేదని, అసలు ఏపీ పోటీ కాదన్నారు. ఏపీనే తెలంగాణను పోటీగా భావిస్తోందని కడియం పేర్కొన్నారు. ఎంపీలు వినోద్‌కుమార్, బాల్క సుమన్, సంతోష్, బడుగు లింగయ్య యాదవ్‌లు పాల్గొన్నారు. -
25న సీబీఎస్ఈ ఎకనమిక్స్ రీ ఎగ్జామ్
న్యూఢిల్లీ: లీకైన∙సీబీఎస్ఈ పదవ తరగతి గణితం, 12వ తరగతి ఆర్థికశాస్త్రం పేపర్ల రీ ఎగ్జామ్‌పై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ‘ఏప్రిల్ 25న దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ 12వ తరగతి ఎకనమిక్స్ పరీక్షను నిర్వహిస్తాం. టెన్త్ మాథ్స్ పరీక్షకు సంబంధించి, పునఃపరీక్ష అవసరమని భావిస్తే.. జూలైలో ఆ పరీక్ష పెడతాం. అదీ లీక్ జరిగిందని భావిస్తున్న ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం(ఢిల్లీ– ఎన్సీఆర్), హరియాణాల్లో మాత్రమే రీఎగ్జామ్ ఉంటుంది. దీనిపై 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్చార్డీ మంత్రి జవదేకర్ తెలిపారు. ఈ లీక్ ఢిల్లీ, హరియాణాలకే పరిమితమైనందున.. దేశవ్యాప్తంగా గణిత పరీక్షను మళ్లీ నిర్వహించదలచుకోలేదని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్ స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని కేంద్ర హెచ్చార్డీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు. అటు సీబీఎస్ఈ పేపర్ లీక్ ఘటనకు సంబంధించి జార్ఖండ్‌లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధిం చి కోచింగ్ సెంటర్ యజమానులు, 18 మంది విద్యార్థులు, పదిమంది వాట్సప్ గ్రూప్ అడ్మిన్లు సహా 45 మందిని ఢిల్లీ పోలీసులు విచారించారు. కాగా, పదోతరగతి గణిత ప్రశ్నాపత్రం లీక్ అయిందంటూ.. ఈ పరీక్షకు ముందురోజే సీబీఎస్ఈ చైర్‌పర్సన్‌కు అజ్ఞాతవ్యక్తి నుంచి ఈ–మెయిల్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఈ–మెయిల్ వివరాలివ్వాలంటూ గూగుల్‌కు లేఖ రాశారు. రాజకీయ దుమారం... తమ తప్పులేకున్నా లీకేజీతో విద్యార్థులు నష్టపోతున్నారని.. ఇదో దురదృష్టకర ఘటన అని కేంద్ర మంత్రి జవదేకర్ పేర్కొన్నారు. తీవ్రమైన ఈ సమస్య పరిష్కారాన్ని విద్యార్థులే సవాల్‌గా తీసుకోవాలని ఢిల్లీలో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2018 (సాఫ్ట్వేర్ ఎడిషన్)లో ఆయన పేర్కొన్నారు. ప్రధాని ఇటీవలే విడుదల చేసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ çపుస్తకాన్ని ఉటంకిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. ‘ఎగ్జామ్ వారియర్స్ 2: పరీక్షపత్రాల లీకేజీ తర్వాత తమ జీవితాలు నాశనమయ్యాయని భావిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు తమ ఒత్తిడిని తగ్గించుకునే విధానం’ అనే పేరుతో ప్రధాని పుస్తకం రాయాలని ఎద్దేవా చేశారు. అటు, ఢిల్లీలో సీబీఎస్ఈ విద్యార్థులు, ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. -
త్వరలో పాఠ్య పుస్తకాలపై క్యూఆర్ కోడ్
న్యూఢిల్లీ: జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎన్సీఈఆర్టీ) ప్రచురించే పాఠ్యపుస్తకాలపై వచ్చే ఏడాది నుంచి క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్‌ను ముద్రించనున్నట్లు కేంద్ర మంత్రి జవదేకర్ చెప్పారు. ఈ కోడ్‌ను విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేయడం ద్వారా ఇంటర్నెట్లో ఆయా పాఠ్యాంశాలకు సంబంధించి ఉన్న వీడియోలు, సబ్జెక్టుల సమాచారాన్ని పొందవచ్చన్నారు. దీంతో విద్యార్థులు పాఠ్యాంశాలను క్షుణ్నంగా అర్థం చేసుకునే వీలుంటుందని చెప్పారు. విద్యా రుణాలు తీసుకునే విద్యార్థులు తాము చదివే కోర్సు కాలపరిమితితోపాటు తర్వాతి ఏడాది వరకు ఆ రుణాలకు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వ విద్యకు సంబంధించి సర్వ శిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్ష అభియాన్, టీచర్ ఎడ్యుకేషన్లను కలిపి ఒకే కార్యక్రమంగా రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
ఐఐఎంల్లో ఇకపై డిప్లొమాలకు బదులుగా డిగ్రీలు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఐఐఎం బిల్లు–2017కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం ఆమోదం తెలిపారు. ఈ చట్టం కింద ఐఐఎంలు ఇకపై విద్యార్థులకు డిప్లొమాలకు బదులుగా డిగ్రీలు ప్రదానం చేయవచ్చని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఈ బిల్లును గతేడాది జూలైలో లోక్‌సభ, డిసెంబర్లో రాజ్యసభ ఆమోదించాయని వెల్లడించారు. తాజా చట్టం కింద ఐఐఎంల నిర్వహణ, బోధనా సిబ్బందితో పాటు డైరెక్టర్ల నియామకంలో సదరు సంస్థలకు మరింత స్వయం ప్రతిపత్తిని కల్పించినట్లు స్పష్టం చేశారు. ఈ చట్టం ప్రకారం ప్రతి ఐఐఎంకు 19 మంది సభ్యులతో కూడిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (బీవోజీ) ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. -
గెలుపే లక్ష్యంగా పోరాటం
∙ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం చేయండి ∙ బీజేపీ నేతలకు ప్రకాష్ జవదేకర్, పీయూష్ గోయల్ క్లాస్ ∙ కోర్‌కమిటీతో ఎన్నికల ఇన్‌చార్జ్‌ల భేటీ సాక్షి, బెంగళూరు: ‘సిద్ధరామయ్య ప్రభుత్వ వైఫల్యాలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి, ప్రభుత్వ అసమర్థతపై మీ సమరానికి మరింత పదును పెట్టండి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు తెలియజేయండి’ అని కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు ప్రకాష్ జవదేకర్, పీయూష్ గోయల్‌లు రాష్ట్ర నేతలకు హితబోధ చేశారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్గా ప్రకాష్ జవదేకర్, ఉప ఎన్నికల ఇన్చార్జ్గా పీయూష్ గోయల్‌లు నియమితులైన తరువాత తొలిసారిగా సోమవారం బెంగళూరుకు వచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో తమ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై నేతలకు దిశానిర్దేశం చేశారు. కోర్ కమిటీ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్ప, రాష్ట్ర ఇన్చార్జ్ మురళీధర్‌రావు, కోర్ కమిటీ సభ్యులు జగదీష్ శెట్టర్, కె.ఎస్.ఈశ్వరప్ప, ప్రహ్లాద్ జోషి, గోవింద కారజోళ తదితరులు పాల్గొన్నారు. విభేదాలు వీడాలి.. వేగం పెంచాలి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలకు సన్నద్ధం కావాలని ప్రకాష్ జవదేకర్, పీయూష్ గోయల్‌లు పార్టీ శ్రేణులకు సూచించారు. ‘రాష్ట్రంలో పెరిగిన అవినీతి, శాంతి భద్రతల సమస్యలు, ఆర్ఎస్ఎస్ నాయకుల హత్యలు, రాష్ట్ర మంత్రులపై ఐటీ దాడులు వంటి అంశాలను రాష్ట్రంలోని ఇంటింటికీ తీసుకెళ్లండి. అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లండి. నేతలంతా ఒక్కటిగా పనిచేస్తేనే ఎన్నికల్లో విజయం సాధ్యమవుతుంది. రాష్ట్రంలో బీజేపీ నేతలు అంత ఉత్సాహంగా, పోరాట పటిమతో పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో అప్పటి ముఖ్య మంత్రి అఖిలేష్ యాదవ్‌పై మేము ఎలాంటి పోరాటం చేశామో, ఆ తరువాతి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను అందుకోగలిగామో మీకందరికీ తెలిసిందే. రాష్ట్రంలో పార్టీ విజయానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అందువల్ల నాయకులంతా తమ తమ సొంత నిర్ణయాలను, అహాన్ని పక్కనపెట్టి పార్టీ కోసం కృషి చేయాలి. గ్రామీణ స్థాయి నుండి పార్టీని పటిష్టం చేసుకుంటూ రావాలి. ఇక నుంచి నెలకోసారి పార్టీ కార్యక్రమాలపై సమావేశం నిర్వహిస్తాం. ఎవరూ కూడా తమ వ్యక్తిగత ప్రతిష్టకు పోవడం, పార్టీలో చీలికకు ఆస్కారం ఇచ్చేలా వ్యాఖ్యలు చేయకూడదు’ అని రాష్ట్ర నేతలకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. -
నీట్ ప్రశ్నాపత్రం అందరికీ ఒక్కటే: జవదేకర్
కోల్‌కతా: జాతీయస్థాయిలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం వచ్చేఏడాది నిర్వహించనున్న నీట్ పరీక్షలో అన్ని భాషల్లో ప్రశ్నాపత్రం ఒకేలా ఉంటుందని కేంద్ర మానవవనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఇందుకోసం నీట్ ఇంగ్లిష్ ప్రశ్నాపత్రాన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తామని పేర్కొన్నారు. నీట్ తరహాలో జాతీయస్థాయిలో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించే అంశం ఇంకా చర్చల దశలోనే ఉందని పేర్కొన్నారు. -
స్కూల్ బ్యాగు భారం తగ్గనుంది: జవదేకర్
నీముచ్: విద్యార్థులపై స్కూలు బ్యాగుల భారం తగ్గించేందుకు కేంద్రం త్వరలో సరికొత్త పథకం ప్రవేశపెట్టబోతున్నట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్ల డించారు. పాఠశాలల్లో డిజిటల్ విధానాలు అవలంబిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. మంగళవారం మధ్యప్రదేశ్ లోని నీముచ్ జిల్లా జవాద్‌లో 20 హైటెక్ పాఠశాలలను ఆయన ప్రారంభించారు. ప్రతిపాదిత పథకం కింద డిజిటల్ బోర్డు, ప్రొజెక్టర్‌ను సమకూర్చుకునే పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెడతామన్నారు. దేశవ్యాప్తంగా 15 లక్షల పాఠశాలల్లో ఒకటి నుంచి 12వ తరగతి వరకు సుమారు 70 లక్షల మంది ఉపాధ్యాయులు 26 కోట్ల మంది విద్యార్థులకు బోధిస్తున్నారని వివరించారు.