గెలుపే లక్ష్యంగా పోరాటం
∙ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం చేయండి
∙ బీజేపీ నేతలకు ప్రకాష్ జవదేకర్, పీయూష్ గోయల్ క్లాస్
∙ కోర్‌కమిటీతో ఎన్నికల ఇన్‌చార్జ్‌ల భేటీ
సాక్షి, బెంగళూరు: ‘సిద్ధరామయ్య ప్రభుత్వ వైఫల్యాలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి, ప్రభుత్వ అసమర్థతపై మీ సమరానికి మరింత పదును పెట్టండి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు తెలియజేయండి’ అని కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు ప్రకాష్ జవదేకర్, పీయూష్ గోయల్‌లు రాష్ట్ర నేతలకు హితబోధ చేశారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ప్రకాష్ జవదేకర్, ఉప ఎన్నికల ఇన్‌చార్జ్‌గా పీయూష్ గోయల్‌లు నియమితులైన తరువాత తొలిసారిగా సోమవారం బెంగళూరుకు వచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో తమ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై నేతలకు దిశానిర్దేశం చేశారు. కోర్ కమిటీ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్ప, రాష్ట్ర ఇన్‌చార్జ్ మురళీధర్‌రావు, కోర్ కమిటీ సభ్యులు జగదీష్ శెట్టర్, కె.ఎస్.ఈశ్వరప్ప, ప్రహ్లాద్ జోషి, గోవింద కారజోళ తదితరులు పాల్గొన్నారు.
విభేదాలు వీడాలి.. వేగం పెంచాలి
ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలకు సన్నద్ధం కావాలని ప్రకాష్ జవదేకర్, పీయూష్ గోయల్‌లు పార్టీ శ్రేణులకు సూచించారు. ‘రాష్ట్రంలో పెరిగిన అవినీతి, శాంతి భద్రతల సమస్యలు, ఆర్‌ఎస్‌ఎస్ నాయకుల హత్యలు, రాష్ట్ర మంత్రులపై ఐటీ దాడులు వంటి అంశాలను రాష్ట్రంలోని ఇంటింటికీ తీసుకెళ్లండి. అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లండి. నేతలంతా ఒక్కటిగా పనిచేస్తేనే ఎన్నికల్లో విజయం సాధ్యమవుతుంది. రాష్ట్రంలో బీజేపీ నేతలు అంత ఉత్సాహంగా, పోరాట పటిమతో పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు.
ఉత్తరప్రదేశ్‌లో అప్పటి ముఖ్య మంత్రి అఖిలేష్ యాదవ్‌పై మేము ఎలాంటి పోరాటం చేశామో, ఆ తరువాతి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను అందుకోగలిగామో మీకందరికీ తెలిసిందే. రాష్ట్రంలో పార్టీ విజయానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అందువల్ల నాయకులంతా తమ తమ సొంత నిర్ణయాలను, అహాన్ని పక్కనపెట్టి పార్టీ కోసం కృషి చేయాలి. గ్రామీణ స్థాయి నుండి పార్టీని పటిష్టం చేసుకుంటూ రావాలి. ఇక నుంచి నెలకోసారి పార్టీ కార్యక్రమాలపై సమావేశం నిర్వహిస్తాం. ఎవరూ కూడా తమ వ్యక్తిగత ప్రతిష్టకు పోవడం, పార్టీలో చీలికకు ఆస్కారం ఇచ్చేలా వ్యాఖ్యలు చేయకూడదు’ అని రాష్ట్ర నేతలకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.