ఢిల్లీలో సీబీఎస్‌ఈ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు
న్యూఢిల్లీ: లీకైన∙సీబీఎస్‌ఈ పదవ తరగతి గణితం, 12వ తరగతి ఆర్థికశాస్త్రం పేపర్ల రీ ఎగ్జామ్‌పై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ‘ఏప్రిల్ 25న దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ 12వ తరగతి ఎకనమిక్స్ పరీక్షను నిర్వహిస్తాం. టెన్త్ మాథ్స్ పరీక్షకు సంబంధించి, పునఃపరీక్ష అవసరమని భావిస్తే.. జూలైలో ఆ పరీక్ష పెడతాం. అదీ లీక్ జరిగిందని భావిస్తున్న ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం(ఢిల్లీ– ఎన్‌సీఆర్), హరియాణాల్లో మాత్రమే రీఎగ్జామ్ ఉంటుంది. దీనిపై 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్చార్డీ మంత్రి జవదేకర్ తెలిపారు.
ఈ లీక్ ఢిల్లీ, హరియాణాలకే పరిమితమైనందున.. దేశవ్యాప్తంగా గణిత పరీక్షను మళ్లీ నిర్వహించదలచుకోలేదని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్ స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని కేంద్ర హెచ్చార్డీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు. అటు సీబీఎస్‌ఈ పేపర్ లీక్ ఘటనకు సంబంధించి జార్ఖండ్‌లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధిం చి కోచింగ్ సెంటర్ యజమానులు, 18 మంది విద్యార్థులు, పదిమంది వాట్సప్ గ్రూప్ అడ్మిన్‌లు సహా 45 మందిని ఢిల్లీ పోలీసులు విచారించారు. కాగా, పదోతరగతి గణిత ప్రశ్నాపత్రం లీక్ అయిందంటూ.. ఈ పరీక్షకు ముందురోజే సీబీఎస్‌ఈ చైర్‌పర్సన్‌కు అజ్ఞాతవ్యక్తి నుంచి ఈ–మెయిల్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఈ–మెయిల్ వివరాలివ్వాలంటూ గూగుల్‌కు లేఖ రాశారు.
రాజకీయ దుమారం...
తమ తప్పులేకున్నా లీకేజీతో విద్యార్థులు నష్టపోతున్నారని.. ఇదో దురదృష్టకర ఘటన అని కేంద్ర మంత్రి జవదేకర్ పేర్కొన్నారు. తీవ్రమైన ఈ సమస్య పరిష్కారాన్ని విద్యార్థులే సవాల్‌గా తీసుకోవాలని ఢిల్లీలో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2018 (సాఫ్ట్‌వేర్ ఎడిషన్)లో ఆయన పేర్కొన్నారు. ప్రధాని ఇటీవలే విడుదల చేసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ çపుస్తకాన్ని ఉటంకిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. ‘ఎగ్జామ్ వారియర్స్ 2: పరీక్షపత్రాల లీకేజీ తర్వాత తమ జీవితాలు నాశనమయ్యాయని భావిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు తమ ఒత్తిడిని తగ్గించుకునే విధానం’ అనే పేరుతో ప్రధాని పుస్తకం రాయాలని ఎద్దేవా చేశారు. అటు, ఢిల్లీలో సీబీఎస్‌ఈ విద్యార్థులు, ఎన్‌ఎస్‌యూఐ, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment