
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై నిరసనలు హోరెత్తుతున్నాయి. 12వ తరగతి ఎకనామిక్స్, 10వ తరగతి మ్యాథ్స్ సబ్జెక్టులకు మళ్లీ పరిక్ష నిర్వహిస్తామని అధికారులు ప్రకటించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. గురువారం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేసిన విద్యార్థులు.. శుక్రవారం సీబీఎస్‌ఈ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనలకు దిగారు. ‘పరీక్షలు సజావుగా నిర్వహించడంలో సీబీఎస్‌ఈ విఫలమైంది. వారు చేసిన తప్పులకు మేం బాధను అనుభవించాలా?’ అని విద్యార్థులు నినదించారు. ‘కొందరు చేసిన నేరానికి అందరికీ శిక్షలెందుకు’ అని వాదిస్తున్నారు. ఇంకొందరైతే సీబీఎస్‌ఈపై తీవ్ర ఆరోపణలతో కూడిన రాతలను ప్లకార్డుల్లో ప్రదర్శించారు.
లీకేజీ తర్వాత పటిష్ఠచర్యలు:
మార్చి 28న జరిగిన(12వ తరగతి ఎకనామిక్స్, 10వ తరగతి మ్యాథ్స్) పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం.. ఒక రోజు ముందే లీకైంది. ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు బోర్డు నుంచి ఫ్యాక్స్ ద్వారా క్వశ్చన్ పేపర్‌ను రాబట్టి, వాట్సప్ ద్వారా విద్యార్థులకు చేరవేశాడని, ఇందుకుగానూ భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం 25 మందిని పోలీసులు ప్రశ్నించారు. లీకేజీ వెలుగులోకి రావడంతో ఆ రెండు పరీక్షలను రద్దుచేస్తున్నట్లు సీబీఎస్‌ఈ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఒకటిరెండు రోజుల్లో కొత్త తేదీలను వెల్లడిస్తామని చెప్పినా.. ఆ మేరకు ముందడుగు పడలేదు. దీంతో విద్యార్థుల్లో ఆందోళన రెట్టింపైంది. లీకేజీ కలకలంతో అప్రమత్తమైన అధికారులు మిగతా పరీక్షల్లో కొత్త పద్ధతిలో క్వశ్చన్ పేపర్లను పంపిణీ చేయనున్నారు.
ఢిల్లీ సర్కార్ ముందే హెచ్చరించినా..:
సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి తమకు కొన్ని ఫిర్యాదులు అందాయని ఢిల్లీ సర్కార్ మార్చి 15నే వెల్లడించింది. ఈ వ్యవహారంపై దృష్టిసారించాలని సీబీఎస్‌ఈని హెచ్చరించింది. కానీ అధికారులు మాత్రం లీకేజీ ఫిర్యాదులను కొట్టిపారేశారు. అన్ని పరీక్షా కేంద్రాల నుంచీ సమాచారం తెప్పించుకున్నామనీ, పేపర్ లీక్ కాలేదని, పరీక్షల ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు దుండగులు పేపర్ లీక్ అయినట్లుగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెట్టి ఉంటారని సీబీఎస్‌ఈ పేర్కొంది. చివరికి లీకేజీ నిజమని తేలడంతో నాలుక కరుచుకున్నారు.
తేలికగా తీసుకోవద్దు:
లీకేజీ వ్యవహారం ఇటు రాజకీయంగానూ దుమారం రేపుతోంది. పరీక్షల నిర్వహణలో విఫలమైన మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్.. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ లీకేజీ అంశాన్ని ఏమాత్రం తేలికగా తీసుకోవద్దని, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment