
హిచ్కీ’ సినిమాలో రాణి ముఖర్జీ
సీబీఎస్‌ఈ 12వ తరగతి ఎకనామిక్స్, 10వ తరగతి మ్యాథ్స్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈపై నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ స్పందించారు. పరీక్షలను మళ్లీ నిర్వహిస్తామన్న సీబీఎస్‌ఈ నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు. స్టూడెంట్స్ పరీక్షలకు బాగా సిధ్దమై ఉంటే సమస్యే ఉండదన్నారు. అటాంటప్పుడు సీబీఎస్‌ఈ పరీక్షల్ని మళ్లీ నిర్వహించడం పట్ల విద్యార్థులు కలత చెందాల్సిన పనిలేదని సూచించారు.
రీ-టెస్ట్‌తో సిలబస్‌లో మార్పులేమీ ఉండవు గనుక పరీక్షలకు చక్కగా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్‌కు సమస్య లేదన్నారు. అయితే ఆదరాబాదరాగా పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు సమస్యలు తప్పవని అభిప్రాయపడ్డారు. మొదటినుంచీ ప్రిపరేషన్ మొదలుపెడితే పరీక్షల్లో మంచి మార్కులు పొందొచ్చని విద్యార్థులకు ఆమె సూచించారు. రాణీ ప్రధాన పాత్రలో నటించిన ‘హిచ్కీ’ సినిమా సక్సెస్ మీట్‌లో ఆమె ఈ విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో ఆమె ‘టురేట్ సిండ్రోమ్’ అనే వ్యాధితో బాధపడే స్కూల్ టీచర్ పాత్రలో నటించారు. కాగా 12వ తరగతి ఎకనామిక్స్ పరీక్షను ఏప్రిల్ 25న తిరిగి నిర్వహించనున్నారు. అలాగే పదో తరగతి మ్యాథ్స్ పరీక్షను కేవలం ఢిల్లీ, హర్యానాలో మాత్రమే నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ యోచిస్తోంది. ఇందుకు సంబంధించి 15 రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది.