తిరుపతి ఎడ్యుకేషన్ : సీబీఎస్‌ఈ మ్యాథ్స్(గణితం) పరీక్ష ప్రశ్న పత్రం లీకైన వార్త విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. పరీక్షలు ముగిశాయనే సంతోషం మటుమాయమైంది. ఎక్కడో ప్రశ్న పత్రం లీకేజీ అయితే దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను శిక్షించ డం సరికాదని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడు తున్నారు.సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) పదో తరగతి పరీక్షలు ఈ నెల 5న దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఎంతో పకడ్బందీగా పరీక్షలను నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 16.35లక్షలకు పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షను రాశారు. ఈ నెల 28న మ్యాథ్స్ పరీక్ష జరిగింది. సాధారణంగా సీబీఎస్‌ఈ పరీక్షల్లో మ్యాథ్స్ పరీక్ష చాలా కఠినంగా ఉం టుందని నిపుణులు చెబుతున్నారు. సోషియల్ పరీక్షకు, మ్యాథ్స్ పరీక్షకు మధ్య నాలుగు రోజులు సమయం ఉండడంతో విద్యార్థులు రేయింబవళ్లు చదివారు. ఈ ఏడాది ఒకింత సులువుగా ప్రశ్నలు ఉండడంతో విద్యార్థులు సంతోషంతో పరీక్షలు రాశారు.
చిత్తూరు జిల్లాలో దాదాపు 15సీబీఎస్‌ఈ స్కూల్స్ ఉన్నాయి. ఒక్క తిరుపతి నగర పరిసరాల్లో కేంద్రీయ విద్యాలయ నెం 1, 2, భారతీయ విద్యాభవన్, ఎడిఫై, అకార్డ్, శ్రీవిద్యానికేతన్, సిల్వర్‌బెల్స్, చిత్తూరులో బీవి.రెడ్డి, పీఈఎస్, చౌడేపల్లె వద్ద విజయవాణి, మనదపల్లెలోని జవహర్ నవోదయ వంటి పాఠశాలలు సీబీ ఎస్‌ఈ పరిధిలోకి వస్తాయి. ఈ ఏడాది ఆయా పాఠశాలల నుంచి సుమారు వెయ్యికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు ముగిసిన ఆనందంలో ఉన్న విద్యార్థులకు రెండు గంటల వ్యవధిలోనే మ్యాథ్స్ పేపర్ లీకై నట్లు వచ్చిన వార్తతో షాక్‌కు గురయ్యారు. అదే రోజు 12వ తరగతి విద్యార్థులకు ఎకనామిక్స్ పరీక్ష జరిగింది. ఈ రెండు పేపర్లూ లీక్ అయ్యాయని, ఈ రెండింటికి తిరిగి పరీక్షను నిర్వహిస్తామని, దానికి సంబంధించిన తేదీని వారంలోపు ప్రకటిస్తామని సీబీఎస్‌ఈ ప్రకటించింది. దీంతో విద్యార్థులు డీలా పడ్డారు. గత ఏడాది మ్యాథ్స్‌లో 7చాప్టర్లే ఉన్నాయని, ఈ ఏడాది 15కి పెంచారని, మ్యాథ్స్ పరీక్ష అంటేనే చాలా కష్టమని, అలాంటిది తిరిగి నిర్వహిస్తామనడం మళ్లీ టెన్షన్‌కు గురిచేస్తోందని నవశక్తి, కీర్తి, సంజన తదితరులు వాపోయారు. మ్యాథ్స్ పేపర్ లీక్ వ్యవహారం ఢిల్లీలో జరిగిందంటూ తల్లిదండ్రులు చెబుతున్నారు. అలాంటప్పుడు ఢిల్లీ రీజియన్‌లో రీ–ఎగ్జామ్ నిర్వహించాలని, అలా కాకుండా దేశవ్యాప్తంగా మ్యాథ్స్ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమంటూ ఇటు తల్లిదండ్రులు, అటు సీబీఎస్‌ఈ పాఠశాలల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. బాధ్యులపై కఠినంగా వ్యవహ రించాలేగానీ ఏకంగా పరీక్షనే రద్దు చేయడం సరికాదని , ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్‌ఈ అధికారులు పునరాలోచించాలని, లీక్ అయిన డిల్లీ రీజియన్‌లో రీ–ఎగ్జామ్ నిర్వహించాలని కోరుతున్నారు.
చాలా కష్టపడి చదివాం
సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలో మ్యాథ్స్ ప్రశ్నపత్రం చాలా కష్టంగా ఉంటుంది. పైగా ఈ ఏడాది 7నుంచి 15కు చాప్టర్లను పెంచారు. మొదటి నుంచే మ్యాథ్స్ సబ్జెక్టుపై దృష్టి సారించి బాగా చదివాం. పరీక్షను బాగా రాశాం. ఇప్పుడు పేపర్ లీక్ అయిందని, తిరిగి పరీక్ష నిర్వహిస్తామని చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. – ఆర్.నవశక్తి, సీబీఎస్‌ఈ విద్యార్థిని
అందరినీ శిక్షిస్తున్నారు
ఎక్కడో ప్రశ్నపత్రం లీక్ అయితే దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను శిక్షిస్తున్నారు. ఎక్కడ ప్రశ్నపత్రం లీకయ్యిందో ఆ రీజియన్‌లో రీ–ఎగ్జామ్ నిర్వహించాల్సింది పోయి అందరికీ పరీక్ష పెట్టడం విద్యార్థులందరికి శిక్షే. ఈసారి మరింత కఠినంగా ప్రశ్నపత్రం తయారు చేస్తారేమోనని టెన్షన్‌గా ఉంది. –బి.ధనుష్ విహారి, సీబీఎస్‌ఈ విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment