అభివృద్ధికి విఘాతమైన రాజకీయం తగదు | Prakash Javadekar inaugurates transit campus of Central University | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి విఘాతమైన రాజకీయం తగదు

Published Mon, Aug 6 2018 2:55 AM | Last Updated on Mon, Aug 6 2018 2:55 AM

Prakash Javadekar inaugurates transit campus of Central University - Sakshi

జేఎన్‌టీయూ(అనంతపురం): స్వాతంత్య్రం అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ‘సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ను ఏర్పాటు చేయడం శుభపరిణామమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. అభివృద్ధికి విఘాతం కలిగించే రాజకీయం తగదన్నారు. ఆయన ఆదివారం జేఎన్‌టీయూ–అనంతపురంలోని ఇంక్యుబేషన్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ తాత్కాలిక క్యాంపస్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ యూనివర్సిటీలో పదేళ్లలో 5,000 మంది విద్యార్థులు విద్యనభ్యసించేలా ప్రత్యేకంగా చొరవ తీసుకుంటామని చెప్పారు. అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం జంతలూరు వద్ద 460 ఎకరాల్లో రూ.1,000 కోట్లతో శాశ్వత క్యాంపస్‌ను నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం భవన నిర్మాణాలకు రూ.460 కోట్లు వెచ్చిస్తామని తెలిపారు. మూడేళ్ల తర్వాత మరో రూ.500 కోట్లు మంజూరు చేస్తామన్నారు.

నూతన విద్యాసంస్థలకు 100% గ్రాంట్లు
ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఉన్నత విద్యాసంస్థలను ఏపీలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకాశ్‌ జవదేకర్‌ పేర్కొన్నారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు. ఉన్నత విద్య అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంఉదారంగా నిధులు మంజూరు చేస్తోందన్నారు. అయినప్పటికీ టీడీపీ మంత్రులు, ఎంపీలు రాజకీయాలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. విద్య పురోగతికి సంబంధించిన అంశాల పట్ల రాజకీయాలు చేయొద్దని చెప్పారు.

నాణ్యనమైన ఉన్నత విద్య మాత్రమే మోదీ ప్రభుత్వానికి జాతీయ ఎజెండా అని, ఇంకే రకమైన ఎజెండాలు లేవని స్పష్టం చేశారు. జాతి నిర్మాణంలో రాజకీయాలు ఉండవని తేల్చి చెప్పారు. నూతనంగా ఏర్పడే విద్యాసంస్థలకు 100 శాతం గ్రాంట్లు తప్పనిసరిగా మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో విద్యకు రూ.3,600 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. 2015 జూన్‌లో తిరుపతిలో ఐఐటీని ప్రారంభించామని, ఇందుకోసం రూ.1,074 కోట్లు జారీ చేశామని గుర్తుచేశారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్, విశాఖపట్నంలో ఐఐఎంను ప్రారంభించామన్నారు.  

నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: మంత్రి గంటా
అనంతపురంలో కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. వెంటనే రాష్ట్ర మంత్రితో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయించింది. ఈ సమావేశంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నీ అవాస్తవాలు చెప్పారని విమర్శించారు. ఏపీలో విద్యాసంస్థల నిర్మాణానికి రూ.వేల కోట్లు మంజూరు చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

దీనిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఇస్తామన్న నిధుల్లో 10 శాతం నిధులు కూడా విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. బహిరంగ సభ వేదికపై కేంద్ర మంత్రి గణాంకాలతో వివరాలు చెబుతుంటే మీరు ఎందుకు నిలదీయలేదని విలేకరులు అడగ్గా.. ‘‘ప్రోటోకాల్‌ ప్రకారం కేంద్ర మంత్రి చివర్లో మాట్లాడుతారు. మా ప్రసంగం తర్వాత ఆయన మాట్లాడారు. కాబట్టి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు తెలియజేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement