కల్పన.. నా ప్రియ నేస్తం
వాషింగ్టన్: మూడు రోజుల పర్యటన నిమిత్తం వాషింగ్టన్ లో అడుగుపెట్టిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందుగా భారత సంతతి వ్యోమగామి కల్పన చావ్లా సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు. ఎర్లింగ్టన్ జాతీయ స్మారక స్థలిలోని కల్పన సమాధితోపాటు కొలంబియా వ్యోమనౌక ప్రమాద మృతుల స్మృతి చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. మోదీ విన్పపం మేరకు ఈ కార్యక్రమానికి చావ్లా కుటుంబసభ్యులతోపాటు మరో భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీత.. కల్పనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
'కల్పన నా ప్రియ నేస్తం. గొప్ప స్నేహితురాలు. మార్గదర్శి కూడా. ఆమెతో మాట్లాడిన, గడిపిన సమయం నా జీవితంలో అత్యంత విలువైనదిగా భావిస్తాను. ఎవరైనాసరే ఆమెతో ఒక్క మాట మాట్లాడారంటే.. ఇంకా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది' అంటూ కల్పన గురించి చెప్పుకొచ్చారు సునీత. ఇంకా.. 'ప్రధాని మోదీని కలుసుకోవడం ఆనందంగా ఉంది. మా నాన్న(దీపక్ పాండ్యా)తో కూడా మాట్లాడారాయన. నన్ను ఇండియాకు రమ్మని ఆహ్వానించారు. నాకు కూడా ఇండియాకు రావాలని, నావాళ్లను కలుసుకోవాలని ఉంది' అని సునీత అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నాసా అసిస్టెంట్ డైరెక్టర్.. అంతరీక్ష పరిశోధనల్లో నాసా, ఇస్రోలు చక్కటి సహకారంతో ముందుకు పోతున్నాయన్నారు.