పట్నా: పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న జామియా మిలియా వర్సిటీ విద్యార్థులపై పోలీసుల అమానుష చర్యను పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన దాడిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల చర్యలను ఖండిస్తూ.. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాసంఘాలు బిహార్‌లో భారీ ర్యాలీని నిర్వహించాయి. జామియా విద్యార్థులపై పోలీసుల దాడిని నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా జేఎన్‌యూ మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థులపై ప్రధాని మోదీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాగా ర్యాలీ సందర్భంగా ఆయన పాడిన ఆజాద్ పాటను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కన్నయ్య స్లొగన్స్‌కు ర్యాలీకి హాజరైన వారి నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది.
కాగా ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీలో ఆందోళనకారులు పలు బస్సులను తగలబెట్టడంతో హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. మంటలను ఆర్పేందుకు వస్తున్న అగ్నిమాపక వాహనాలను కూడా విద్యార్థులు ధ్వంసం చేశారు. పోలీసుల లాఠీ చార్జిలో పలువురు విద్యార్థులు, ఆందోళనకారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీలోనే కాక దేశ వ్యాప్తంగా పౌరసత్వ చట్టం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పడు సమీక్ష జరుపుతోంది. శాంతిభద్రతలను పూర్తిగా అదుపులో ఉంచాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment