సత్యసాయిగా నేను మళ్లీ జన్మించాను!
సత్య సాయిబాబా మళ్లీ భూమ్మీద అవతరించారా? అవునని.. ఆ అవతారం తానేనని బెంగళూరు సమీపంలోని ముద్దెనహళ్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చెబుతున్నాడు. సాయిబాబా 90వ జయంతి అయిన నవంబర్ 24న భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించాలని భక్తులు భావిస్తున్న తరుణంలో ఈ పునర్జన్మ వాదన వెలుగులోకి రావడం విశేషం. సత్యసాయి మరణించడానికి ముందు తన వారసుడిగా ఎవరినీ ప్రకటించలేదు. కానీ ఇప్పుడు ముద్దెనహళ్లికి చెందిన మధుసూదన్ నాయుడు మాత్రం.. తానే సాయి వారసుడినని చెబుతున్నాడు. సాయిబాబా రోజూ తనకు కలలోకి వస్తారని, తానేం చేయాలో అన్నీ ఆయనే చెబుతారని కూడా అంటున్నాడు. జయంతి వేడుకలు భారీగా చేయాలని కూడా తనకు బాబాయే చెప్పారంటున్నాడు.
అయితే, పుట్టపర్తిలోని సత్య సాయిబాబా ట్రస్టు సభ్యులు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. సాయిబాబా పునర్జన్మ ఎత్తలేదని, మధుసూదన్ నాయుడు ఆయన వారసుడు కానేకాడని అంటున్నారు. పుట్టపర్తి ప్రాధాన్యాన్ని, పవిత్రతను మంటగలిపేందుకు కర్ణాటకలోని కొందరు కుట్ర పన్నుతున్నారని చెప్పారు. సాయిబాబా 2011లో మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి నుంచి పుట్టపర్తికి భక్తుల రాక గణనీయంగా తగ్గింది. అంతకుముందు 25-30వేల మంది విదేశీ భక్తులు, లక్షలాది మంది భారతీయులు రోజూ ఆశ్రమానికి వచ్చేవారు. ఇప్పుడు విదేశీయుల సంఖ్య 3-4వేలకు, భారతీయుల సంఖ్య కూడా వేలలోకి పడిపోయింది. ట్రస్టుకు బ్యాంకులలో రూ. 1500 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని, వాటిమీద వడ్డీయే ఏడాదికి రూ. 120 కోట్లు వస్తుందని చెబుతున్నారు. ఏడాదికి దాదాపు రూ. 60 కోట్ల వరకు విరాళాలు కూడా వస్తుంటాయి. అందుకే ఈ ఆశ్రమం మీద ఆధిపత్యం కోసం తరచు ప్రయత్నాలు జరుగుతుంటాయి.