నిలిచిన కేదార్‌నాథ్ యాత్ర
డెహ్రాడూన్: చార్‌ధామ్ యాత్రలో ఒకటైన కేదార్‌నాథ్ యాత్రకు అవాంతరాలు ఏర్పడ్డాయి. హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న ఈ ఆలయం వద్ద, పరిసర ప్రాంతాల్లో తాజాగా మంచు కురవడంతో యాత్ర నిలిచిపోయింది. కేదార్‌నాథ్ లోయ అంతటా ఆదివారం మంచు కురిసిందని, దాంతో యాత్ర నిలిపివేసినట్లు రుద్రప్రయాగ ఎస్పీ బరీందర్‌జిత్ సింగ్ తెలిపారు. యాత్రీకులు సోన్‌ప్రయాగ వద్దే ఆగి, వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు వేచి ఉండాలని కోరినట్లు చెప్పారు. ఆరు నెలల శీతాకాలం విరామం తర్వాత కేదార్‌నాథ్ ఆలయాన్ని ఈ నెల 4న తిరిగి భక్తుల కోసం తెరిచిన విషయం తెలిసిందే. ఈ నెల 13 వరకు చార్‌ధామ్ (కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి) యాత్రా మార్గంలో, హిమాలయాల్లోని 3,500 మీటర్ల ఎత్తయిన ప్రాంతాల్లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు జల్లులు పడతాయని వాతావరణ శాఖ స్థానిక కార్యాలయం అంచనా వేస్తోంది.
1. మరోవైపు ఆలయ ప్రధాన పూజారి భీమశంకర్‌లింగ కూడా వారం రోజుల పాటు యాత్రను వాయిదా వేసుకోవాలని భక్తులకు సూచించారు. రోడ్ల పరిస్థితి బాగోలేకపోవడంతో యాత్రను కొనసాగించడం ప్రమాదకరమని చెప్పారు.
2. గతేడాది యాత్రా సమయంలో వరదలు ముంచెత్తడంతో సుమారు 5వేల మంది భక్తులు జలసమాధి అయిన విషయం తెలిసిందే.
3. {పముఖ హిందుస్థానీ గాయకుడు పండిట్ జస్‌రాజ్ ఆదివారం మందిరం వద్ద తన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన డెహ్రాడూన్‌లోనే ఉండిపోయారు