
సాక్షి,న్యూఢిల్లీ: ఇంటి ముందుకే రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, కుల ధ్రువీకరణ పత్రం వంటి 40 సేవలను అందించేలా ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. దీనికి సంబంధించిన పధకం మూడు,నాలుగు నెలల్లో రూపొందిస్తామని దేశంలోనే తొలిసారిగా ప్రజల ముందుకే పాలన ఫలాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఈ పధకం అమలు కోసం ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీ సేవలు తీసుకుంటుందని చెప్పారు.
తొలి దశలో కుల ధృవీకరణ పత్రం, వాటర్ కనెక్షన్, ఇన్‌కమ్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, వివాహ రిజిస్ర్టేషన్, డూప్లికేట్ ఆర్‌సీ, ఆర్‌సీలో చిరునామా మార్పు వంటి సేవలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోదలిస్తే వారు ప్రత్యేక కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
ఏజెన్సీ ప్రతినిధులు ఆ వివరాలతో మొబైల్ సహాయక్‌తో దరఖాస్తుదారు ఇంటికి వెళ్లి అవసరమైన పత్రాలను తీసుకుంటారని చెప్పారు.మొబైల్ సహాయక్‌లో బయోమెట్రిక్ పరికరాలు, కెమెరా వంటి అన్ని మౌలిక వసతులు ఉంటాయని దీనికి సంబంధించి దరఖాస్తుదారు నామమాత్ర రుసుము చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.