నటి వీడియో హీరో చేతికి ఎలా వచ్చింది?
కొచ్చి: కేరళ నటి కిడ్నాప్, వేధింపుల కేసులో సూపర్ స్టార్ దిలీప్ పక్కా ప్లాన్ తోనే వ్యవహరించాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరో విషయం ఓ వీఐపీని కలవరానికి గురిచేస్తుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. నటిని కారులో కిడ్నాప్ చేసి ఆపై అశ్లీల ఫొటోలు, వీడియోలు తీసిన ప్రధాన నిందితుడు పల్సర్ నునీ మొదట ఆ డాటాను లాయర్ ప్రతీక్ ఛకోవ్ కు పంపించాడని విచారణలో వెల్లడైంది. ఎస్పీ ఏవీ జార్జ్ మాత్రం విచారణకు సంబంధించిన కీలక వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు.
ప్రస్తుతం పరారీలో ఉన్న లాయర్ ఛకోవ్ నుంచి ఆ వీడియోలు, ఫొటోలు ఓ వీఐపీ చేతికి అందినట్లు సమాచారం. ఆ వీఐపీ నేరుగా నటుడు దిలీప్ నకు నటిపై వేధింపులు జరిపిన తతంగానికి సంబంధించిన డాటాను ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. లాయర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని నిజాలు బయటకొస్తాయని, కేసు త్వరగా కొలిక్కి వస్తుందని కేరళ పోలీసులు భావిస్తున్నారు. అయితే కేసు విషయమై ఫోన్ లో నిజంగానే డాటా ఉందని సమాచారం ఇచ్చి, విచారణకు సహకరించాడన్న కారణంతో ఆయనను ఇంకా అదుపులోకి తీసుకోలేదు. మరోవైపు ఈ కేసులో ప్రధాన హస్తం ఉన్న నటుడు దిలీప్ ను ఈ నెల 10న పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. దిలీప్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా అంగమాలి సబ్ జైలులో ఉన్నారు.