కేరళ అసెంబ్లీలో రణరంగం | Kerala Assembly ranarangam | Sakshi
Sakshi News home page

కేరళ అసెంబ్లీలో రణరంగం

Published Sat, Mar 14 2015 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM

Kerala Assembly ranarangam

  • సభ్యుల వీరంగంతో అట్టుడికిన సభ
  • బడ్జెట్‌ను అడ్డుకునేందుకు ఎల్డీఎఫ్ విశ్వప్రయత్నం
  • పోడియం వద్ద విధ్వంసం, ముక్కలైన స్పీకర్ కుర్చీ
  • తిరువనంతపురం: అధికార-విపక్ష సభ్యుల మధ్య ఘర్షణతో శుక్రవారం కేరళ అసెంబ్లీ అట్టుడికింది. ప్రజాప్రతినిధులంతా తమ స్థాయిని మరిచి సభలోనే అనుచితంగా ప్రవర్తించారు. కొట్టుకోవడం, కొరుక్కోవడం, తోపులాటలతో సభ రణరంగంగా మారింది. బార్ లెసైన్సుల జారీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ర్ట ఆర్థిక మంత్రి కేఎం మణి సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి వీల్లేదంటూ ప్రతిపక్షాలు వీరంగం సృష్టించాయి. బడ్జెట్‌ను అడ్డుకోడానికి స్పీకర్ పోడియంలోనే విధ్వంసానికి దిగాయి.

    ఈ గందరగోళ పరిస్థితుల మధ్యే బడ్జెట్‌ను మంత్రి మణి ప్రవేశపెట్టారు. విపక్షాలను అడ్డుకోడానికి అధికార యూడీఎఫ్ ఎమ్మెల్యేలు ఆయనకు అడ్డుకోటగా నిలవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భద్రతా సిబ్బంది కూడా భారీగా మోహరించడంతో సభ్యులు ఏకంగా బాహాబాహీకి దిగారు. అస్వస్థతకు గురైన పలువురు ఎమ్మెల్యేలను సభలో నుంచి ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.

    బడ్జెట్‌ను ఎలాగైనా అడ్డుకోవాలని కొందరు విపక్ష సభ్యులు, సభలో ప్రవేశపెట్టి తీరాల్సిందేనని ఆర్థిక మంత్రి సహా పలువురు మంత్రులు ముందు రోజు రాత్రి కూడా అసెంబ్లీలో ఉండిపోవడమే పరిస్థితికి అద్దం పడుతోంది. మణికి వ్యతిరేకంగా అసెంబ్లీ బయటా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నిరసన తెలుపుతున్న ఎల్డీఎఫ్, యువ మోర్చ కార్యకర్తలపై పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించి, లాఠీచార్జ్ చేశారు. ఈ గొడవల్లో ఓ సీపీఎం కార్యకర్త చనిపోయాడు. నిరసనకారులు ఓ పోలీసు వాహనాన్ని తగులబెట్టారు.
     
    సభ ప్రారంభానికి ముందే అలజడి

    శుక్రవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభానికి ముందే అలజడి మొదలైంది. ప్రతిపక్ష ఎల్డీఎఫ్ కూటమి సభ్యులంతా సభలోకి వెళ్లే అన్ని మార్గాలకు అడ్డంగా నిలుచునున్నారు. స్పీకర్ వేదికను చుట్టుముట్టారు. మార్షల్స్ వారిని అక్కడినుంచి పక్కకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయడంతో తోపులాట మొదలైంది. ఈ క్రమంలోనే విపక్ష సభ్యులు స్పీకర్ కుర్చీని విరగ్గొట్టారు. అక్కడి స్పీకర్లు, కంప్యూటర్లు, లైట్లను ధ్వంసం చేశారు. ఓవైపు గొడవ జరుగుతుండగానే మరో ద్వారం నుంచి ఆర్థిక మంత్రి మణి సభలోకి ప్రవేశించారు. దీంతో విపక్ష సభ్యుల దృష్టి ఆయన వైపు మళ్లింది.

    చాలా మంది మూకుమ్మడిగా ఆయనవైపు దూసుకెళ్లారు. తోపులాటల మధ్యే ఆయన బడ్జెట్‌లోని కీలకాంశాలను వేగంగా చదివి వినిపించారు. కాగా, జేడీఎస్ మహిళా ఎమ్మెల్యే ప్రమీలా ప్రకాశం తనను కొరికిదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శివదాసన్ నాయర్ మీడియాకు వెల్లడించారు. తన భుజాన్ని కొరికినట్లు గాయాలు చూపించారు.

    అయితే ఆయనే తనను కులం పేరుతో దూషించారని ప్రమీల ఆరోపించారు.  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులతో అస్వస్థతకు గురైన ఆరుగురు ఎల్డీఎఫ్ ఎమ్మెల్యేలను స్ట్రెచర్లు, వీల్‌చైర్లలో ఆసుపత్రులకు తరలించారు. శనివారం రాష్ర్టవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఎల్డీఎఫ్ ప్రకటించింది. ఈ ఘటనలపై సీఎం ఊమెన్ చాందీ స్పందిస్తూ.. అసెంబ్లీకే బ్లాక్‌డేగా పేర్కొన్నారు. దీనంతటికీ విపక్షాలే కారణమన్నారు. సోమవారం బ్లాక్ డేగా పాటించనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement