
తిరువనంతపురం : కేరళలో భారీ వర్షాలతో మరణించిన వారి సంఖ్య 67కు పెరిగింది. వరద బీభత్సంతో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. వరద నీరు నిలిచిపోవడంతో కొచ్చి ఎయిర్‌పోర్ట్‌ను శనివారం వరకూ మూసివేశారు. భారీ వర్షాలతో విమానాశ్రయం రన్‌వే, పార్కింగ్ ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు పలు రైలు సర్వీసులు రద్దుకాగా, మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.
రిజర్వాయర్ల నుంచి నీటి ప్రవాహాన్ని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తుండగా, లోతట్టు ప్రాంతాలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయని చెప్పారు. వివిధ జలాశయాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నాశనివారం వరకూ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.
ముళ్లపెరియార్ డ్యామ్‌లో నీటి సామర్ధ్యం 140 అడుగులు దాటడంతో గేట్లను ఎత్తివేసిన క్రమంలో ఇడుక్కి జిల్లాపై అధికారులు దృష్టిసారించారు. పెరియార్ నదీ తీరంలో నివసించే వందలాది మందిని గేట్లు తెరిచే ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
సహాయక చర్యలు ముమ్మరం..
వరద తాకిడి తీవ్రమవడంతో సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేసేందుకు నేవీ 21 సహాయ, డైవింగ్ బృందాలను కేరళకు తరలించింది. వయనాడ్ జిల్లాలోనే జెమిని బోట్స్‌తో పలు ప్రాంతాల్లో ఐదు నౌకాదళ బృందాలు రంగంలోకి దిగాయి. వరదనీటిలో చిక్కుకున్న వారిని రక్షించడంతో పాటు సహాయ, పునరావాస శిబిరాల్లో వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఎర్నాకుళం జిల్లాలో ఏడు టీంలు వరద సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయని అధికారులు తెలిపారు. పెరంబదూర్‌లో నీటి ప్రవాహంలో చిక్కుకున్న 45 మందిని రెస్య్యూ టీం కాపాడింది. పెరియార్ నది పొంగిపొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు సాయం చేసేందుకు పలు బృందాలను ఆ ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు.
కొచ్చి మెట్రో సేవలు రద్దు
వరద తీవ్రతతో మధ్య కేరళలో ప్రజా రవాణా వ్యవస్థ కుప్పకూలింది. భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వే, కొచ్చి మెట్రో గురువారం తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. అంగమలై, అలువా మధ్య నెంబర్ 176 బ్రిడ్జిపై నీటి ప్రవాహం పెరగడంతో ఈ బ్రిడ్జిపై రైలు సేవలను నిలిపివేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రతినిధి వెల్లడించారు. ఇక కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ (కేఎంఆర్‌ఎల్) సైతం అలువా సమీపంలోని మటం వద్ద తమ యార్డు నీట మునగడంతో మెట్రో సర్వీసులు రద్దు చేశామని అధికారులు తెలిపారు.
కేంద్ర సాయంపై ప్రధాని హామీ
పోటెత్తిన వరదతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేరళను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. వరద పరిస్థితిపై గురువారం కేరళ సీఎం పినరయి విజయన్‌తో మోదీ చర్చించారు. రాష్ట్రంలో వరదలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కేరళ ప్రజల వెన్నంటి ఉంటామని, రాష్ట్రానికి అవసరమైన ఎలాంటి సాయం అందించేందుకైనా కేంద్రం సిద్దంగా ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
రెండు రోజుల పాటు విద్యాసంస్థలు బంద్
భారీ వర్షాలతో ఎర్నాకుళం జిల్లాలో అన్ని విద్యాసంస్థలను నేడు, రేపు ( 16, 17 తేదీల్లో) మూసివేశారు. ఇతర ప్రాంతాల్లోనూ విద్యాసంస్థల తలుపులు తెరుచుకునే పరిస్థితి లేదని అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలు నీట మునిగాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment