సాక్షి, తిరువనంతపురం : దేవభూమిగా, ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా పేరొందిన కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. గత తొమ్మిది రోజులుగా నిర్విరామంగా కురుస్తున్న వర్షాలతో మలయాళ సీమ మరుభూమిని తలపిస్తోంది. ఎప్పుడూ ఏ వైపునుంచి వరద ప్రవాహం ముంచుకొస్తుందోనని జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కేరళ విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు త్రివిధ దళాలు, 51 జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు (ఎన్డీఆర్‌ఎఫ్) ముమ్మరంగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. కేరళ వరదలపై అప్‌డేట్స్ ఇవి:
- భారీ వర్షాలు, వరదలతో అస్తవ్యస్తమైన కేరళలో క్రమంగా వాతావరణం కుదుటపడే అవకాశాకాలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో కేరళలోని ఎనిమిది జిల్లాల్లో ఇటీవల ప్రకటించిన రెడ్ అలర్ట్‌ను తాజాగా ఉపసంహరించారు. ఇంకా మూడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఎర్నాకుళం, ఇడుక్కి, పతనంతిట్ట జిల్లాల్లో ఇప్పటికీ రెడ్ అలర్ట్ కొనసాగుతోంది
- ఎటూచూసినా మోకాళ్లలోతు నీళ్లు.. పీకల్లోతు కష్టాలు.. ఏకంగా ఊరుకు ఊరే మునిగిపోయి.. వరదనీటిలో చెరువును తలపిస్తున్న వైనం.. చుట్టూ చేరిన వరదనీళ్లతో బిక్కుబిక్కుమంటూ ఎటుపోవాలో తెలియక అల్లాడుతున్న ప్రజలు.. ఇది కేరళలోని అంగమలై అలువా ప్రాంతంలో పరిస్థితి. ఇక్కడి పరిస్థితికి సంబంధించిన వీడియోను జర్నలిస్టు ధన్యా రాజేంద్రన్ ట్విటర్‌లో షేర్ చేశారు. మోకాళ్లలోతు చేరిన నీళ్ల వల్ల చిన్న వాహనాలు రోడ్లమీద వెళ్లే పరిస్థితి లేదని, దీంతో తాను ట్యాక్సీని వీడి.. ఎన్డీఆర్‌ఎఫ్ బస్సులో ప్రయాణిస్తూ ఈ వీడియో తీశానని ఆమె తెలిపారు. ఈ వీడియో తీసే క్రమంలో ఎన్డీఆర్‌ఎఫ్ సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలిగించలేదని పేర్కొన్నారు.
This is how the Angamaly Aluva route looks now. This is the point with the maximum amount of water. Big vehicles can go. I had to abandon my taxi, got into an NDRF bus. No, I didn't hamper any rescue, but just took some space and hopped off at Aluva. pic.twitter.com/3pAWudrDRs
— Dhanya Rajendran (@dhanyarajendran) 18 August 2018
-
కేరళకు రూ. 500 కోట్ల సాయాన్ని ప్రధాని మోదీ తాజాగా ప్రకటించడాన్ని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తప్పుబట్టారు. తాజా సంభవించిన భారీ వరదలతో కేరళ దాదాపు 20వేల కోట్ల రూపాయలు నష్టపోయిందని, సత్వర సహాయక, పునరావాస చర్యల కోసం తక్షణమే రూ. 2వేల కోట్ల సాయాన్ని అందించాలని కేరళ అడిగితే.. ప్రధాని మోదీ మాత్రం అతి తక్కువ సాయాన్ని అందించారని ఆయన ట్విటర్‌లో తప్పుబట్టారు.
- భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం చేస్తున్న కేరళకు ప్రతి ఒక్కరూ సాయం చేయాలని ప్రముఖ నటి రాయ్ లక్ష్మి ట్విటర్‌లో సూచించారు. ఎన్ని కోట్లు ఇచ్చామనే సంఖ్య ముఖ్యం కాదని, అందరూ కలిసి ముందుకువచ్చి సాయం చేస్తే.. కేరళ వాసులను ఎంతోకొంత ఆదుకున్నవాళ్లం అవుతామని ఆమె పేర్కొన్నారు. ఏమీ చేయకపోవడం కన్నా ఎంతోకొంత చేయడం మేలే కదా అని ఆమె ప్రశ్నించారు. కేరళ కేంద్రాన్ని రూ. 1220 కోట్లు అడిగితే.. కేంద్రం మాత్రం 600 కోట్లు ఇచ్చిందని, ఇది ఏమాత్రం సరిపోదని, కేరళ పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌పై ఆమె ఈవిధంగా స్పందించారు.
- ఆప్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తమ ఒక నెల జీతాన్ని కేరళకు విరాళంగా అందజేయనున్నారని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు
- వర్షాలతో అతలాకుతలం అవుతున్న కేరళకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రూ. 5 కోట్ల తక్షణ సహాయాన్ని ప్రకటించారు.
- కేరళ విపత్తులో ఇప్పటివరకు 190మందికిపైగా చనిపోయారు. మూడు లక్షలమందిని సహాయక శిబిరాలకు తరలించారు. గత వందేళ్లలో ఎన్నడూలేనివిధంగా భారీ వరదలు ముంచెత్తడంతో కేరళ చిగురుటాకులా వణికిపోతోంది. త్రివిద దళాల నేతృత్వంలో 1300 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
-
వరదలతో అతలాకుతలమవుతున్న కేరళకు తక్షణ సాయంగా ప్రధాని నరేంద్ర మోదీ రూ.500 కోట్లు ప్రకటించారు. వరదల బీభత్సంతో రాష్ట్రంలో సుమారు రూ.20వేల కోట్ల నష్టం జరిగిందని, తక్షణమే రెండు వేల కోట్లు సాయం కింద విడుదల చేయాలని కేరళ ప్రభుత్వం ప్రధాని మోదీని విజ్ఞప్తి చేసింది. పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు శనివారం కేరళ వచ్చిన మోదీ, సీఎం పినరయి విజయన్‌తో సమావేశం అయ్యారు. అనంతరం ఈ నెల 12న కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన రూ.100కోట్లు అదనంగా మరో రూ.500 కోట్ల సాయాన్ని ప్రకటించారు. ఏరియల్ సర్వే ద్వారా వరద పరిస్థితిని సమీక్షించారు. వరదల్లో మృతి చెందిన వారికి కేంద్ర ప్రభుత్వం తరపున రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేల నష్టపరిహారం ప్రకటించారు.
-
కేరళ వరదలను వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన ట్విటర్ లో ‘ప్రియమైన ప్రధాని మోదీ గారు.. ఎలాంటి ఆలస్యం చేయకుండా కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి. లక్షలాది మంది ప్రజల జీవితాలు, జీవనోపాధి, భవిష్యత్ మీ చేతిలో ఉంది’ అని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment