![Kerala High Court Allows Woman To Live With Woman Partner - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/25/Kerala.jpg.webp?itok=4ku_leR5)
ప్రతీకాత్మక చిత్రం
తిరువనంతపురం : స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు చట్టబద్దం చేయడంతో కేరళ హైకోర్టు మంగళవారం మరో సంచలన తీర్పును వెలువరించింది. ఓ 40 ఏళ్ల మహిళ, 24 యువతితో కలిసి జీవించవచ్చని అనుమతినిచ్చింది. సీకే అబ్దుల్ రహీమ్, నారయణలతో కూడిన డివిజన్ బెంచ్ ఇద్దరు మహిళలు సహజీవనం చేయవచ్చని తీర్పునిచ్చింది. కొల్లామ్‌లోని వెస్ట్ కల్లాడకు చెందిన శ్రీజ(40) తన పార్టనర్ అరుణ(24)ను కోర్టు ముందు హాజరుపరచాలని హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు అరుణతో కలిసి జీవించాలని ఉందని, దీనికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని, బలవంతంగా తన నుంచి ఆమెను దూరం చేశారని పేర్కొన్నారు. గత ఆగస్టు నుంచి తామిద్దరం కలిసే ఉంటున్నామని, అరుణ పేరేంట్స్ మాత్రం మిస్సింగ్ కేసు నమోదు చేసి తన నుంచి దూరం చేశారని తెలిపారు.
అరుణను బలవంతంగా పిచ్చాసుపత్రిలో చేర్పించారని, ఎలాగోలా ఆమెను అక్కడ కలిసానని, కానీ ఆసుపత్రి వారు తనతో తీసుకెళ్లడానికి అనుమతినివ్వలేదన్నారు. దీంతో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశానన్నారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు అరుణను తమ ముందు హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. దీంతో వారు అరుణను మంగళవారం కోర్టు ముందు హాజరుపరిచారు. శ్రీజతో కలిసుండటంలో తన ఉద్దేశం ఏమిటో కోర్టుకు అరుణ వివరించింది. అలాగే పిటిషనర్ శ్రీజ ఇటీవల స్వలింగ సంపర్కం నేరం కాదంటూ.. సెక్షన్ 377ను సవరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. దీంతో ఈ ఇద్దరు సహజీవనం చేయవచ్చని కోర్టు తీర్పునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment