
ప్రభుత్వ మద్యం విధానానికి హైకోర్టు సమర్ధన
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వ మద్యం విధానాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు సమర్ధించింది. కేరళలోని బార్ యజమానులకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువడింది. ఫైవ్ స్టార్ హోటల్స్, అనుమతించిన బార్లలో మాత్రమే మద్యం విక్రయించాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఫైవ్ స్టార్ హోటళ్లలో తప్ప మిగిలిన చోట్ల మద్యం విక్రయించడాన్ని నిషేధిస్తూ కేరళ ప్రభుత్వం గత సంవత్సరం సెప్టెంబరులో ఆదేశాలు జారీ చేసింది. కొత్త విధానంతో రాష్ట్రంలోని దాదాపు 730 బార్లను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్య వివక్షతతో కూడినదిగా వుందని బార్ యజమానులు విమర్శిం చారు. దీనివల్ల తాము చేసే వ్యాపారం కోల్పోవడమే కాకుండా, పర్యాటక రంగం కూడా దెబ్బతింటుం దని అన్నారు. ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ బార్ యజమానులు హైకోర్టుని, ఆ తరువాత సుప్రీం కోర్టుని ఆశ్రయించారు.
బార్ యజమానులు పెట్టుకున్న పిటిషన్‌ను విచారించేందుకు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ అంగీకరించింది. హైకోర్టు దీన్ని పరిష్కరించేవరకు దీనిఅమలుపై స్టే విధించాలని కోరుతూ బార్ యజమానులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త మద్యం విధానం వెనుక గల తార్కికతను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రవ్యాప్తంగా గల 730 బార్లు నాసిరకం ప్రమాణాలతో వున్నాయని ముద్ర వేస్తూ, ఫైవ్ స్టార్ హోటళ్ళలో మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకుండా వదిలివేయడాన్ని కోర్టు ప్రశ్నించింది. ''ఇందులో ఎలాంటి లాజిక్ లేదు. అసలు నాసిరకం ప్రమాణాలంటే మీ అర్ధం ఏంటి? నేను ఆల్కహాల్ తాగను. అయినా ఇందులో నాకు లాజిక్ కనపడడం లేదు. మీరు దీన్ని ఎలా సమర్ధిస్తారు?'' అని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ, మద్యం అమ్మడం బార్ యజమానుల ప్రాధమిక హక్కేమీ కాదన్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. ఏ సమయంలోనైనా బార్ లైసెన్సులు రద్దు చేస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్వర్తులపై స్టే విధిస్తూ కొత్త మద్య విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను వేగంగా పరిష్కరించాలని కేరళ హైకోర్టును సుప్రీం ఆదేశించింది.
వాదప్రతివాదనలు విన్న అనంతరం కేరళ హైకోర్టు ప్రభుత్వ విధానాన్ని సమర్ధిస్తూ తీర్పు చెప్పింది.