బార్ల మూసివేత... ఆదివారాల్లో మద్యం అమ్మకాలు బంద్
తిరువనంతపురం: కేరళలో దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధం విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ నేతృత్వంలో జరిగిన యూనెటైడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ యూడీఎఫ్ భేటీ అనంతరం ఉమెన్ చాందీ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఫైవ్‌స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం అమ్మకాలు సాగుతాయని, పదేళ్లలో మొత్తం రాష్ట్రంలో మద్యం నిషేదిస్తామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మూతపడిన 418 బార్లు మళ్లీ తెరుచుకునే అవకాశం లేదని,అన్నారు.
ఆదివారాల్లో మద్యం అమ్మకాలు జరపకూడదని కూడా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏటా పది శాతం మద్యం దుకాణాలు మూసివేస్తామని, ఇలా పదేళ్లలో సంపూర్ణ మద్య నిషేధం సాధిస్తామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బెవరేజెస్ కార్పొరేషన్‌కు సంబంధించిన దుకాణాల్లో పనిచేసే వారికి ప్రత్యామ్నాయాలు చూపుతామని తెలిపారు. ఈ అంశం కేరళ కేబినెట్ ముందుకు వెళుతుందని, ఆ తర్వాత అధికారిక నిర్ణయం వెలువడుతుందని యూడీఎఫ్ కన్వీనర్ పీపీ టంకచ్చన్ తెలిపారు.
కేరళలో సంపూర్ణ మద్య నిషేధం
Published Fri, Aug 22 2014 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM
Advertisement
Advertisement