ఆ క్రీడ నా కుమారుడిని బలితీసుకుంది!
కేరళ: బ్లూవేల్ గేమ్ వలనే తన కుమారుడు ఆత్మహత‍్య చేసుకున్నాడని ఓ మహిళ పోలీసుకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే గత నెల 26న తిరువనంతపూర్‌కు చెందిన మనోజ్(16) ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మనోజ్ గత ఏడాది బ్లూవేల్ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, గేమ్‌కు సంబంధించి రోజుకో టాస్క్ పూర్తి చేస్తూ చివరి దశకు వచ్చాడు. అతనిలో రోజుకో మార్పు చోటుచేసుకునేదని తల్లి చెప్పింది. ఎవరినైనా చంపాలి లేకపోతే నేనైనా చావాలి అంటూ అందరిని ఆశ్చర్యపరిచే మాటలనే వాడని ఆమె పెర్కొన్నది.
గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశాడని కాకపోతే అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడన్నది. చనిపోయే ముందు అతని ఫోన్‌లో ఆ గేమ్‌ని డిలీట్ చేశాడని చెప్పింది. బ్లూవేల్ గేమ్ వలనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. మంగళవారం ‘బ్లూవేల్ చాలెంజ్’ గేమ్, ఆ తరహా ఆన్‌లైన్ ఆటలకు సంబంధించిన అన్ని లింక్‌లను తక్షణం తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్ దిగ్గజ సంస్థలను ఆదేశించిన విషయం తెలిసిందే.