
‘కింగ్’ను విచారిస్తున్న ఈడీ
రెండోరోజూ కింగ్‌ఫిషర్ మాజీ సీఎఫ్‌వో విచారణ
♦ బ్యాంకు అధికారులకూ ఈడీ నోటీసులు
♦ ఆదుకోండంటూ.. ప్రధానికి ఉద్యోగుల లేఖ
ముంబై/బెంగళూరు: మనీ లాండరింగ్ కేసులో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ సీఎఫ్‌వో ఏ రఘునాథన్ వరుసగా రెండో రోజూ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఐడీబీఐ బ్యాంకుకు విజయ్‌మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ (కేఎఫ్‌ఏ) కంపెనీ రూ. 9కోట్ల అప్పు ఎగ్గొట్టిన కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఆరేడుగురు కేఎఫ్‌ఏ అధికారులకు విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీచేసింది. విచారణలో వీరి వ్యక్తిగత ఐటీ రిటర్న్ పత్రాలు తీసుకురావాలన్నారు. రఘునాథన్‌తోపాటు, ఐడీబీఐ బ్యాంకు మాజీ చైర్మన్, ఎండీ యోగేశ్ అగర్వాల్, కేఎఫ్‌ఏ, బ్యాంకుల సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారులకూ నోటీసులందాయి.
వీరిని పూర్తిగా విచారించాకే లిక్కర్ కింగ్ మాల్యాకు నోటీసులివ్వాలని ఈడీ యోచిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించిన నిధులను కేఎఫ్‌ఏకు ఇవ్వటంలో బ్యాంకు అధికారుల పాత్ర ఉందనే కోణంలోనూ విచారణ జరుపుతోంది. కాగా, సంస్థనుంచి రావాల్సిన రూ. 300 కోట్లను ఇప్పించి ఆదుకునేందుకు జోక్యం చేసుకోవాలని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు ప్రధానికి లేఖ రాశారు. కేఎఫ్‌ఏ మూసివేత వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 7వేల మంది ఉద్యోగుల జీవితాలు రోడ్డుపైకి వచ్చాయన్నారు. ‘మీరు తప్ప మమ్మల్ని ఎవరూ ఆదుకోలేరు. ఈ లేఖ వ్యర్థం కాదని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
అదో కారణమంతే: కాంగ్రెస్
మాల్యాను ప్రభుత్వం కావాలనే తప్పించిందని విమర్శిస్తున్న కాంగ్రెస్.. తాజాగా సీబీఐ తప్పుడు లుకౌట్ నోటీసు ఇందుకు ఓ కారణమంది. మాల్యాను తప్పించేందుకు కావాలనే తప్పుడు నోటీసులిచ్చి వెనక్కు తీసుకున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ తెలిపారు.
మాల్యా పారిపోలేదు: దేవెగౌడ
కర్ణాటక మట్టిలో పుట్టి పెరిగి, పారిశ్రామికవేత్తగా ఎదిగిన మాల్యా అప్పులు తీర్చకుండా దేశం విడిచి పారిపోయారనడం సరికాదని జేడీ(ఎస్) జాతీయాధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ బెంగళూరులో అన్నారు. ‘మాల్యా విదేశాలకు పారిపోయారనడం సరికాదు. బహుశా విదేశాల్లో ఏదైనా పనులు ఉండటం వల్ల అక్కడికి వెళ్లి ఉండొచ్చు. అంతేకానీ దేశం విడిచి పారిపోయే వ్యక్తి కాదు. రూ. 9వేల కోట్ల అప్పు తీర్చలేని స్థితిలో మాల్యా ఉన్నారనుకోను’ అని పేర్కొన్నారు.
‘బికినీ బ్యూటీ’లే మాల్యా ఆస్తి
మాల్యాపై డెరైక్టర్ రాంగోపాల్ వర్మ ట్విటర్‌లో స్పందించారు. ఆయన పెంచిపోషించిన ‘బికినీ బ్యూటీ’లను ఒక్కో బ్యాంకుకు ఇచ్చేస్తే మాల్యా అప్పులన్నీ తీరతాయని వ్యంగ్యంగా అన్నారు. ‘మాల్యా బికినీ బ్యూటీ ప్రతిపాదనను బ్యాంకులు ఒప్పుకోకపోవచ్చు కానీ బ్యాంకర్లు ఒప్పుకుంటారు. ఈ బ్యూటీలకోసమే ఇంత అప్పుచేసిన మాల్యాకు.. అప్పులు తీర్చుకునేందుకు ఈ బ్యూటీలు సరిపోరా?’ అని ట్వీట్ చేశారు. బ్యాంకర్లను వశపరుచుకునేందుకు మాల్యాకు కేలండర్ బ్యూటీలయిన దీపిక పదుకొనె, నర్గిస్ ఫక్రిస్, ఇషా గుప్తా, కత్రినాకైఫ్ వంటి వాళ్లు చాలా సాయపడి ఉండొచ్చన్నారు.