మాల్యా విల్లాను కొనేవారే కరువయ్యారు
ముంబై: కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు చెందిన విల్లాను కొనేందుకు ఈసారి కూడా ఎవరూ ముందుకు రాలేదు. గురువారం మూడోసారి వేలం నిర్వహించగా ఎవరూ పాల్గొనలేదు. గతంలో నిర్వహించిన వేలానికి స్పందన రాకపోవడంతో 5 శాతం డిస్కౌంట్‌తో రూ.81 కోట్ల రిజర్వ్ ధరగా విల్లాను మళ్లీ వేలానికి పెట్టారు. ఈ సారి బయ్యర్లు వస్తారని ఆశించామని, అయితే ఎవరూ బిడ్లను దాఖలు చేయకపోవడంతో వేలం ప్రక్రియ మళ్లీ ఆగిపోయిదని అధికారులు చెప్పారు.
పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో విల్లాకు ఇంత భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేయడానికి బయ్యర్లు విముఖత చూపారని నిపుణులు చెబుతున్నారు. అక్టోబరులో ఈ విల్లాకు నిర్వహించిన వేలంలో రిజర్వ్ ధరను 85.29 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. తాజాగా నిర్వహించిన వేలంలో ఈ ధరను మరింత తగ్గించినా ఫలితం లేకపోయింది. ఉత్తర గోవాలోని కండోలిమ్ వద్ద ఈ విల్లా ఉంది. బ్యాంకులకు చెల్లించాల్సిన 9 వేల కోట్ల రూపాయలను మాల్యా ఎగవేసిన కేసులో బకాయిల వసూళ్ల కోసం ఈ విల్లాను వేలానికి పెట్టారు.