మాల్యా విల్లాను కొనుగోలు చేసిన హీరో
ముంబై: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన గోవాలోని విలాసవంతమైన కింగ్ ఫిషర్ విల్లా ఎట్టకేలకు అమ్ముడైంది. సినీ నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషి ఈ విల్లాను సొంతం చేసుకున్నారు. ఈ విల్లాను అమ్మడానికి బ్యాంకు అధికారులు పలుమార్లు వేలం నిర్వహించినా నిర్ణీత ధరకు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. సంప్రదింపుల ద్వారా బేరం మాట్లాడుకుని సచిన్ జోషికి అమ్మేందుకు అంగీకరించారు. చివరి సారి వేలంలో నిర్ణయించిన రిజర్వ్ ధర 73 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం చెల్లించేందుకు ఆయన అంగీకరించారు. కింగ్ ఫిషర్ విల్లాను అమ్మిన విషయాన్ని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య ధ్రువీకరించారు.
బ్యాంకులకు మాల్యా భారీ మొత్తంలో రుణాలను ఎగవేసిన కేసులో ఆయన ఆస్తులను కొన్నింటిని బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. రుణాలను రికవరీ చేసేందుకుగాను గోవాలోని మాల్యా విల్లాను వేలానికి ఉంచారు. కండోలిమ్‌లో అరేబియా సముద్రానికి ఎదురుగా ఈ విల్లా ఉంది. ఈ విలాసవంతమైన విల్లాలో అన్ని రకాల సదుపాయాలు, వసతులు ఉన్నాయి. వేలంలో ఈ విల్లాను కొనుగోలు చేసేందుకు కొందరు ఆసక్తి చూపినా రిజర్వ్ ధర చెల్లించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పలుమార్లు నిర్వహించిన వేలంలో రిజర్వ్ ధరను 85 కోట్ల నుంచి 81 కోట్లకు, చివరకు 73 కోట్ల రూపాయలకు తగ్గించారు. చివరకు ఈ విల్లాను సచిన్ జోషి సొంతం చేసుకున్నారు. జేఎంజే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వైస్ చైర్మన్ హోదాలో జోషి ఫిట్‌నెస్ సెంటర్ల నుంచి హెల్త్ స్పేష్ వరకు పలు రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. హిందీ చిత్రాలు అజాన్, ముంబై మిర్రర్, జాక్‌పాట్‌లలో నటించారు.