
టాక్సీల మెరుపు సమ్మె.. ప్రయాణికులకు కష్టాలు
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతా నగరంలో టాక్సీ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. చార్జీలు పెంచడంతో పాటు పోలీసుల వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని యూనియన్లు పిలుపునివ్వడంతో టాక్సీలన్నీ ఒక్కసారిగా రోడ్లెక్కడం మానేశాయి. ఆగస్టు నుంచి ఇప్పటికి టాక్సీ యూనియన్లు సమ్మెచేయడం ఇది ఎనిమిదోసారి. అసలే టాక్సీలు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటే, దానికి తోడుగా ఎనిమిది కార్మిక సంఘాలకు చెందిన రవాణా కార్మికులు శుక్రవారం నాడు కోల్కతాలో మొత్తం రవాణా సమ్మె చేయాలని పిలుపునిచ్చారు. టాక్సీలకు మద్దతుగా వాళ్లీ సమ్మె చేస్తున్నారు.
టాక్సీలు లేకపోవడంతో ఆటోలు, సైకిల్ రిక్షా స్టాండుల వద్ద భారీ క్యూలు కనిపించాయి. ఇక బస్సుల్లోనైతే జనం వేలాడుతూ వెళ్లారు. ఇదే అదనుగా ప్రయాణికుల వద్ద చిన్న చిన్న దూరాలకు కూడా భారీ మొత్తాలు వసూలు చేశారు. ఒకవైపు ఈ దోపిడీ, మరోవైపు ఉక్కపోత కారణంగా చాలామంది ఏసీ బస్సులవైపు మొగ్గుచూపారు. 2012 తర్వాత టాక్సీ మీటర్ ధరలు పెంచలేదని, పెట్రోధరలు మాత్రం అప్పటినుంచి 13 సార్లు పెరిగాయని టాక్సీ యూనియన్ ప్రతినిధులు అంటున్నారు.