సాక్షి, అలహాబాద్: యూపీ సీఎంగా యోగి ఆదిత్యా నాథ్ పగ్గాలు చేపట్టిన అనంతరం తొలిసారి జనవరి 2019లో జరిగే కుంభమేళాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత 2013 కుంభమేళా బడ్జెట్‌తో పోలిస్తే రెండున్నర రెట్లు అధికంగా వెచ్చించనున్నారు. రూ 2500 కోట్లతో 16 శాఖల సమన్వయంతో దాదాపు 200కు పైగా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు పనులు జరుగుతున్నాయి. కుంభమేళాలో కేవలం పుణ్య స్నానాలు ఆచరించడమే కాక, యాత్రికులకు మెరుగైన ఆథ్యాత్మిక, ధార్మిక అనుభూతులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
యాత్రికులకు నడక ఇబ్బందులు తొలగించేందుకు ఈసారి షటిల్ సర్వీసులు ప్రారంభిస్తున్నామని అలహాబాద్ కమిషనర్ అశిష కుమార్ గోయల్ చెప్పారు. కుంభమేళాను యూపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఉత్సవాలకు ఏడాది ముందుగానే మేళా ఇన్‌చార్జిగా బాద్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ అలహాబాద్‌లో కుంభమేళా పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు.
యూపీ ప్రభుత్వం ఇప్పటికే రూ.1648 కోట్లతో 199 ప్రాజెక్టులను ఆమోదించి పనులు ప్రారంభించిందని చెప్పుకొచ్చారు. కుంభ్ ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేలా లైవ్ డాష్‌బోర్డులతో ఆన్‌లైన్ ప్రాజెక్టు మానిటరింగ్ వ్యవస్థను నెలకొల్పారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా రూ. 500 కోట్లతో అలహాబాద్‌లో బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment