అరుణ్ జైట్లీపై మోదీ తీవ్ర ఆరోపణలు
న్యూయార్క్: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ వ్యవహారంలో బీజేపీ కీలక నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే విమర్శలపాలవగా.. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేరు తెరపైకి వచ్చింది.
జైట్లీని లక్ష్యంగా చేసుకుని మోదీ విమర్శలు చేశాడు. జైట్లీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు చేస్తూ మోదీ ట్వీట్లు చేశాడు. జైట్లీని కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా మోదీ ఆరోపించాడు. ఢిల్లీ జిల్లా క్రికెట్ సంఘం (డీడీసీఏ) స్కాంలో జైట్లీ ప్రమేయముందని ఆరోపించాడు. జైట్లీ తన ఫోన్ కాల్స్ డేటాను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశాడు. కాగా మోదీ వ్యాఖ్యాలపై స్పందించేందుకు జైట్లీ నిరాకరించారు. మోదీ వ్యాపారంలో భాగంగాగానే 11 కోట్ల రూపాయలను రాజస్థాన్ ముఖ్యమంత్రి కుమారుడు, ఎంపీ దుష్యంత్ సింగ్కు చెందిన కంపెనీలో పెట్టుబడులు పెట్టారని జైట్లీ చెప్పారు. ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీకి వీసా మంజూరు విషయంలో సాయపడినందుకు సుష్మా, వసుంధర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.