రాంచీ: ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. రూ.900 కోట్ల దాణా కుంభకోణం కేసుకు సంబంధంచి ఆయన విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చారు. చైబాసా జిల్లా ట్రెజరీ నుంచి 37.70 కోట్ల రూపాయలను అక్రమంగా విత్ డ్రా చేశారనే ఆరోపణపై లాలూ సహా 38మందికి జూన్ 2న న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.
ఈ కేసులో లాలూ దోషిగా రుజువుకావడంతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా కోల్పోయారు. ఆయన ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. కాగా లాలూ ఆదివారం సాయంత్రమే పట్నా నుంచి రాంచీ చేరుకున్నారు.